ప్రపంచానికి ‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ (63) ఇకలేరు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జాన్ ఆ చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘టైటానిక్’ సినిమాతో ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అందుకున్న జాన్ ఇకలేరు అంటూ సినిమా అభిమానులు తమ విచారం వ్యక్తం చేస్తున్నారు. జాన్ ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు జాన్ నిర్మాతగా చేశారు.
జాన్‌కి భార్య, ఇద్దరు కుమారులు జేమీ, జోడీ ఉన్నారు. 31 ఏళ్లుగా నా ప్రియమైన స్నేహితుడు జాన్ లాండౌ లేకపోవడం నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది. 20 ఏళ్లుగా ఆయన నిర్మించిన చిత్రాలే కాదు.. జాన్ వ్యక్తిత్వం, సినిమాల పట్ల ఉన్న అంకితభావం ప్రత్యేకమైనవి అని ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంతాపం వ్యక్తం చేశారు. 1980లో ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించారు జాన్. 1997లో ‘టైటానిక్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు.
200 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించగా.. 2.264 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు 11 ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక మిగిలిన అవార్డుల లెక్క చాలా పెద్దదిగానే ఉంటుంది. జాన్ నిర్మించిన సినిమాల లిస్ట్ చూస్తే.. ‘కాంపస్ మ్యాన్’, ‘టైటానిక్’, ‘సొలారిస్’, ‘అవతార్’, ‘అలిటా: బ్యాటిల్ ఏంజెల్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలు ఉన్నాయి.
ఇంకా ఆయన ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మాణంలో ఉన్న సినిమాలు చూస్తే.. ‘అవతార్ 3’, ‘అవతార్ 4’ ఉన్నాయి. వచ్చే ఏడాది ‘అవతార్ 3’ రానుండగా.. 2029లో ‘అవతార్ 4’ను తీసుకొస్తారు. వీటితోపాటు ‘హనీ: ఐ ష్రంక్ ది కిడ్స్’, ‘డిక్ ట్రేసీ’ లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.