దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల కవల పిల్లలకు తల్లయింది. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. సరోగసీ ద్వారా నయనతార తల్లి కావడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు లీగల్ గా కూడా నయనతార ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నయన్ సరోగసీ ద్వారా తల్లి అవ్వడం న్యాయబద్ధంగా జరిగిందా..? లేదా..? అనేది విచారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ కొన్ని రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
దానికి నయనతార, విఘ్నేష్ శివన్ లు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నయన్ అద్దె గర్భానికి సహకరించిందెవరు..? అనే విషయంపై విచారణ జరుగుతోంది. కేరళకు చెందిన ఓ యువతి.. సరోగసీ ద్వారా బిడ్డల్ని కని.. నయనతారకు అప్పగించిందని విచారణలో తేలింది. ఆమె నయనతారకు స్నేహితురాలట. నయన్ కేరళలో చదువు పూర్తి చేసింది. తనతో పాటు కాలేజీలో చదివిన తన స్నేహితురాలితోనే నయన్ కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలుస్తోంది.
అయితే సరోగసీ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నయన్ అతిక్రమించిందనేది ప్రధాన ఆరోపణ. అదే గనుక నిజమని నిరూపిస్తే పదేళ్ల జైలు శిక్ష, పది లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోపక్క నయనతార కూడా కొంతమంది లాయర్లను సంప్రదిస్తోందట.
ఈ కేసు నుంచి ఎలా బయట పడాలనే విషయంపై చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ కేసుపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో ‘జవాన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.