నవ్వించే ఖాకీలు

  • August 25, 2016 / 10:12 AM IST

దొంగలు, దుర్మార్గుల వేటలో పోలీసుల మనసు గట్టిపడిపోతుంది. డ్యూటీలోకి వెళ్లింది మొదలు క్రూరమైన కేసులు.. అరాచకాలు చూసి ఖాకీ డ్రస్ వెనుక హృదయం సుకుమారాన్ని కోల్పోతుంది. వృత్తిపరమైన ఒత్తిడిలో నవ్వు దూరమైపోతుంది. అందుకే సినిమాల్లో పోలీసుల పాత్ర అంటే గతంలో దర్శకులు కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే రాసేవారు. కామెడీ చేయడానికి వేరే ట్రాక్ ని వినియోగించుకునేవారు. ఈ పరిస్థితిని పోకిరి చిత్రం మార్చి వేసింది. పూరి జగన్నాథ్ ఒక ఐపీఎస్ తో ఫైట్స్ మాత్రమే కాదు కామెడీని పండించవచ్చని నిరూపించారు. ఆ తర్వాత సినిమాల్లో నవ్వించే ఖాకీలు ఎక్కువ అయ్యారు. వీరు యాక్షన్ తో యూత్ ని ఆకట్టుకుని, కామెడీతో మహిళల మనసులను గెలుచుకొని, విజయాలను సొంతం చేసుకున్నారు.

దూకుడుసూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి తర్వాత పోలీస్ గా చేసిన చిత్రం దూకుడు. ఇందులో అజయ్ గా మహేష్ అద్భుత కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఓ వైపు సీరియస్ గా గ్యాంగ్ స్టర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఫైట్స్ చేస్తూనే మిత్రులతో కలిసి హీరోయిన్ ను ఆట పట్టిస్తాడు. ఈ క్యారక్టర్ లో మహేష్ అమ్మాయిలకు భలే నచ్చాడు.

గబ్బర్ సింగ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పదేళ్ల తర్వాత హిట్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇందులో కొంచెం తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అంటూ నవ్వులు పూయించారు. నచ్చిన అమ్మాయిని ప్రేమించే సీక్వెన్స్, విలన్స్ తో అంత్యాక్షరి సీన్ పగలబడి నవ్వేలా చేస్తాయి. ఈ ఉత్సాహంతోనే సర్దార్ గబ్బర్ సింగ్ లోను మరింత కామెడీ సన్నివేశాలతో నవ్వించే ప్రయత్నం చేశారు.

బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే యాక్షన్ మాత్రమే గుర్తుకొస్తుంది. అతని చేత పంచ్ లతో థియేటర్ నిండా నవ్వులు నింపారు శ్రీను వైట్ల. బాద్ షా సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్న ఏసిపీ రామారావు పాత్రలో ఓ వైపు మాఫియా డాన్ లతో రిస్కీ ఫైట్స్ చేస్తూ బంతి జానకితో తారక్ సరదాగా నటించాడు.

పవర్విక్రమార్కుడు సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ గా మాస్ మహారాజ్ రవితేజ మెప్పించారు. అటువంటి సీరియస్ ఆఫీసర్ కి చిలిపి తనం జోడించి దర్శకుడు బాబీ పవర్ చిత్రం తీశారు. ఇందులో రవితేజ తాను రెండు వైపులా పదునే అని నిరూపించుకున్నారు.

పటాస్నందమూరి కళ్యాణ్ రామ్ ఐపీఎస్ ఆఫీసర్ కళ్యాణ్ సిన్హా గా నటించిన సినిమా పటాస్. ఇందులో హీరో మనసుపడిన అమ్మాయిని దక్కించుకునేందుకు చేసే పనులు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. యాక్షన్, కామెడీని సమపాళ్లలో మిక్స్ చేసి అనిల్ రావిపూడి హిట్ అందుకున్నాడు.

బాబు బంగారం

ఘర్షణ సినిమాలో సీరియస్ పోలీస్ అధికారిగా కనిపించిన విక్టరీ వెంకటేష్ బాబు బంగారం లో జాలీ పోలీస్ ఆఫీసర్ గా నటించి కడుపుబ్బా నవ్వించారు. ఉద్యోగ ధర్మంలో భాగంగా క్రిమినల్స్ ను కొట్టడం, తర్వాత జాలితో తానే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించడం, వారు త్వరగా కోలుకోవాలని పూజలుచేయడం వంటి పనులు కితకితలు పెట్టించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus