టాలీవుడ్ నటుడు నవదీప్ కు గత కొంతకాలంగా తలనొప్పిగా మారిన డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తున్న ఆయనకు తెలంగాణ హైకోర్టు ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు వెలువడిన తీర్పుతో ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. చట్టపరంగా ఆయనకు ఇది పెద్ద విజయమనే చెప్పాలి.
2023లో నమోదైన ఈ డ్రగ్స్ కేసు అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నవదీప్ వ్యక్తిగత ప్రతిష్టను కూడా ఈ వివాదం దెబ్బతీసింది. విచారణ సంస్థలు పలుమార్లు ఆయన్ను పిలిపించి ప్రశ్నించడంతో పాటు అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేశాయి. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణ దశలోనే ఉంటూ వచ్చింది. ఆ సమయంలో ఆయన కెరీర్ కూడా కాస్త స్లో అయ్యిందని చెప్పొచ్చు.
అసలు విషయానికి వస్తే.. ఈ కేసులో నవదీప్ పేరును చేర్చడానికి పోలీసుల దగ్గర ఎలాంటి పక్కా సాక్ష్యాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం ఇతర నిందితులు చెప్పిన వివరాల ఆధారంగానే ఆయన్ను ఈ కేసులోకి లాగారని కోర్టు గుర్తించింది. ఆయన దగ్గర ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని.. కేవలం అనుమానాల మీద ఒక వ్యక్తిపై కేసును నడిపించడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇతర ఆధారాలు లేకుండా విచారణ జరపడం వల్ల ఫలితం ఉండదని తేల్చి చెప్పారు.
నవదీప్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ వినిపించిన వాదనలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రత్యక్ష సాక్ష్యాలు లేని పక్షంలో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించడం చట్టవిరుద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రాథమిక ఆధారాలు కూడా లేని ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనితో ఆయనకు చట్టపరంగా పూర్తి క్లీన్ చిట్ లభించినట్లయింది. ఇకపై ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు.