మార్చి 10 న జరగనున్న ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకూ ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా పదవీకాలం పూర్తికానుండడంతో… మళ్ళీ ఎన్నికలకి రంగం సిద్ధమయ్యింది. శివాజీ రాజా మళ్ళీ ఈ ఎన్నికల బరిలో పోటీకి సిద్ధం కాగా .. సీనియర్ నరేశ్ కూడా రంగంలోకి దిగాడు. ‘నరేష్ వర్సెస్ శివాజీరాజా’ గా మారిన ‘మా’ ఎన్నికల్లో పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
ఇక ఈ క్రమంలో సీనియర్ యాక్టర్ నరేశ్ మాట్లాడుతూ .. “గతంలో నేను నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ కి ఒక మాట చెప్పాను .. అందరం కూడా ఒక్కో టర్మ్ అధ్యక్షుడిగా చేసి తప్పుకుందామని చెప్పాను. దాంతో ఆయన ఒక టర్మ్ పూర్తి చేసి చాలా హుందాగా పక్కకి తప్పుకున్నాడు. అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.ఇక ఆ తరువాత శివాజీరాజా కోరిక మేరకు ఆయన అధ్యక్షుడు కావడానికి సహకరించాను. ఆయనకి నా అంత అనుభవం లేనప్పటికీ… మాకు ఉన్న అనుబంధంతో అండగా నిలిచాను. కొన్ని కారణాల వలన శివాజీ రాజా పనితీరు పై చాలామందిలో అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. అందువలనే నేను రంగంలోకి దిగాల్సివచ్చింది. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే సరికొత్త విధానాలతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో వున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.