‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి, అదేదో మాస్ జాతర అన్నారు అదైనా అనుకోండి అందులో రష్మిక మందన (Rashmika Mandanna) మాట్లాడుతుంటే.. విజయ్ దేవరకొండలానే (Vijay Devarakonda) మాట్లాడింది కదా అని ఆమె ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఆ యాస, బాడీ లాంగ్వేజ్ బాగా కనిపించాయి. ఇప్పుడు టాపిక్ ఇది కాదు కానీ.. ఈ ఇద్దరూనే టాపిక్. అవును విష్మికనే ఇప్పుడు టాపిక్. రష్మిక కొత్త సినిమా ‘గర్ల్ ఫ్రెండ్’ కోసం రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ సాయం చేస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
‘పుష్ప: ది రూల్’ పనులు పూర్తయ్యాక రష్మిక నెక్స్ట్ ఎత్తుకోబోయే ప్రాజెక్ట్ అదే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్స్ జోరుగా సాగుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు కీలకమైన వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తారో తేలింది అంటున్నారు. సినిమాకు మంచి హైప్ ఇవ్వడానికి, విష్మిక ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడానికి విజయ్ దేవరకొండతో వాయిస్ ఓవర్ ఇప్పించే పనులు జరుగుతున్నాయట.
గర్ల్‌ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ చేయకుండా ఉంటాడా అంటూ ఓ రేంజిలో ప్రచారం చేసే ఆలోచనలో కూడా టీమ్ ఉంది అని సమాచారం. అయినా ఇప్పటికే సినిమా ఓ లెవల్ ప్రచారం వచ్చేసింది. ‘పుష్ప: ది రూల్’ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ (Sukumar) రష్మిక నెక్స్ట్ మూవీ ‘గర్ల్‌ఫ్రెండ్’ గురించి ప్రస్తావించారు. ఆ సినిమా టీజర్ తాను చూశానని, రాహుల్ చూపించాడని, అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని సుక్కు పొగిడేశారు.
మొత్తం క్లోజప్ షాట్లతో నింపేశారని, అన్నీ అదిరిపోయాయని చెప్పారు. ఇప్పుడు దీనికి విజయ్ వాయిస్ తోడైతే ఇక ఊర మాస్ హైప్ పక్కా అని చెప్పాలి. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.