టచ్ చేసి చూడు

  • February 2, 2018 / 12:28 PM IST

దాదాపు ఏడాది విరామం అనంతరం “రాజా ది గ్రేట్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకొన్న రవితేజ నటించిన తాజా చిత్రం “టచ్ చేసి చూడు”. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం ద్వారా “రేసుగుర్రమ్” చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రవితేజ మాస్ ఏమేజ్ కి విక్రమ్ సిరికొండ టేకింగ్ ఏమేరకు హెల్ప్ అయ్యింది, ఆడియన్స్ ఏమేరకు ఎంటర్ టైన్ అయ్యారు. ఇంతకీ రవితేజను టచ్ చేసి చూస్తే ఏమయ్యింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ : ఎస్.కార్తికేయ (రవితేజ) పాండిచ్చేరిలో ప్రయివేట్ బిజినెస్ చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేస్తుంటాడు. నెమ్మదస్తుడే కానీ పద్ధతులు ఫాలో అవుతుంటాడు. తన కంపెనీ గుడౌన్ లోని మెషినరీని లోకల్ రౌడీ సెల్వమ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా అతడ్ని డైరెక్ట్ గా ప్రశ్నించకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాడు. అలా రూల్స్ ఫాలో అవుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ.. తల్లిదండ్రులు చూసిన సంబంధమైన పుష్ప (రాశీఖన్నా)ను పెళ్లాడి సెటిల్ అవుదామనుకొంటున్న తరుణంలో కార్తికేయ లైఫ్ లోకి మళ్ళీ వస్తాడు ఇర్ఫాన్ (ఫ్రెడ్డి దారూవాలా). అతడి రాకతో కార్తికేయ రెండో కోణం బయటపడుతుంది. ఏమిటా రెండో కోణం? ఇర్ఫాన్ ఎవరు? అతడితో కార్తికేయకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “టచ్ చూసి చూడు”.

నటీనటుల పనితీరు : రవితేజ కొత్తగా ప్రయత్నించాలి అనుకొన్నారో లేక దర్శకుడు ఆయన క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశాడా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. సెటిల్డ్ ఫ్యామిలీ మెన్ గా పర్వాలేదు కానీ.. అమ్మాయిని మెప్పించడం కోసం తపించే సన్నివేశాల్లో మాత్రం రవితేజ మార్క్ మిస్ అయ్యింది. ముఖ్యంగా రవితేజ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఎనర్జీ ఈ సినిమాలో కనిపించలేదు. అయితే.. యాక్షన్ సీక్వెన్స్ లలో తనదైన శైలి ఎనర్జీతో అలరించాడు మాస్ మహారాజా. రాశీఖన్నా పూర్తిస్థాయిలో సన్నబడ్డాక నటించిన సినిమా ఇది. గ్లామర్ డోస్ బాగా పెంచింది. తెలియక చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఎక్స్ పోజింగ్ పరంగా కాస్త అతి చేసింది. శీరత్ కపూర్ సినిమాలో ఏదో రెండో హీరోయిన్ ఉండాలి అని ఒక మూడు సన్నివేశాలు, ఒక పాట మరియు ఒక స్లో మోషన్ షాట్ లో హీరోకి డాష్ ఇవ్వడానికి మినహా పెద్దగా కథ పనికొచ్చింది లేదు. మురళీశర్మ పోలీస్ క్యారెక్టర్ కి క్లారిటీ లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. వెన్నెలకిషోర్, సుదర్శన్ ల కామెడీ బాగుంది.

సాంకేతికవర్గం పనితీరు : బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ మ్యూజిక్ బ్యాండ్ “జామ్ 8” అందించిన బాణీలు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. సదరు పాటల ప్లేస్ మెంట్ కానీ చిత్రీకరణ కానీ బాగోకపోవడం వల్ల ఆ పాటలు వల్ల సినిమాకి ఒరిగేదేమీ లేకుండాపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, టాప్ యాంగిల్ షాట్స్, పాండిచ్చెరి ఎపిసోడ్స్ సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. వక్కంతం వంశీ అందించిన కథ చిరంజీవి క్లాసిక్ హిట్ “మాస్టర్”ను తలపిస్తుంది. ఒక్క పోలీస్ యాంగిల్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్.

ఇక స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ అని అందరూ తెగ పొగిడేసిన విక్రమ్ సిరికొండ వేరే దర్శకుల చిత్రాల రాసుకొన్నంత పకడ్బందీగా తన డైరెక్షనల్ డెబ్యూ మూవీ అయిన “టచ్ చేసి చూడు” సినిమా కోసం మాత్రం చక్కని స్క్రీన్ ప్లే రాసుకోకపోవడం గమనార్హం. కథా గమనానికి ఒక ఫ్లో ఉండదు. ఎంటర్ టైన్మెంట్ కోసం క్యారెక్టర్స్ ను ఎక్కువగా క్రియేట్ చేసి వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు విక్రమ్ సిరికొండ. రవితేజ లాంటి ఎనరర్జిటిక్ హీరోని పెట్టుకొని ఒక్క ఓల్డ్ సిటీ ప్రచార సభ/ర్యాలీ ఎపిసోడ్ తప్ప సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకొనే సన్నివేశం లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. రవితేజ సినిమా అంటేనే.. మాస్ ఎలిమెంట్స్ తోపాటు కామెడీ కూడా పుష్కలంగా ఉంటుందని ఎంతో ఆశతో వస్తారు ప్రేక్షకులు. అలాంటివారిని పూర్తిస్థాయిలో నిరాశకు లోను చేశాడు విక్రమ్ సిరికొండ.

విశ్లేషణ : మాస్ మసాలా సినిమాలకు ముఖ్యంగా కావాల్సిన అంశాలు ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే, ఆశ్చర్యపరిచే ట్విస్టులు, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్, అలరించే కామెడీ. “టచ్ చేసి చూడు” సినిమాకోసం పైన పేర్కొన్న అంశాలను పేపర్ మీద రాసుకోవడం వరకూ బాగానే జరిగిందని సినిమా చూస్తే అర్ధమవుతుంది. అయితే.. అదే సినిమా చూసిన తర్వాత తెలిసేదేమిటంటే సదరు అంశాలను స్క్రీన్ పై ఎగ్జిక్యూట్ చేయడంలో చిత్రబృందం ఫెయిల్ అయ్యిందని. సో, రవితేజ వీరాభిమానులు సైతం ఒకసారి ట్రై చేసి చూద్దామనుకొంటే.. కనీసం రెండుమూడు సార్లు ఆలోచించాల్సిన చిత్రం “టచ్ చేసి చూడు”.

రేటింగ్ : 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus