‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రచారం రెండు రకాలుగా జరిగింది మీరు గమనించారా. సినిమా విడుదలైనంతవరకు ఒకలా సాగితే.. సినిమా విడుదలై మంచి విజయం అందుకోగానే మరోసారి జరిగింది. తొలి ఫేజ్‌లో లేనిది, రెండో ఫేజ్‌లో ఉన్నది ఏంటీ అని చూస్తే.. త్రివిక్రమ్ ప్రస్తావన అని తెలిసిపోతుంది. కావాలంటే మీరే చూడండి. ‘అనగనగా ఒక రాజు’ సినిమా విజయం సాధించిన తర్వాత టీమ్‌కి త్రివిక్రమ్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు అంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. సినిమా టీమ్‌ను ఆయన తెగ మెచ్చేసుకున్నారు కూడా.
ఈ క్రమంలో గతంలో నిర్మాత నాగవంశీ చెప్పిన కొన్ని విషయాలు వైరల్ అయ్యాయి కూడా. తమ సినిమాల కథ జడ్జిమెంట్ విషయంలో త్రివిక్రమ్ పక్కాగా ఉంటారని.. అదే తమ విజయ రహస్యం అని కూడా టీమ్ చెప్పేది. అందుకు తగ్గట్టుగానే సితార సినిమాల విజయాలు, ఆ తర్వాత త్రివిక్రమ్ మెచ్చుకోలు మనం చూశాం. అయితే నాగవంశీ నిర్మించిన సినిమాల ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా తర్వాత ఎక్కడా త్రివిక్రమ్ ప్రస్తావన రాలేదు. ఆయన సినిమా గురించి ఏమన్నారు, ఏం చేశారు అనేది ఎప్పుడూ రాలేదు.
ఇక్కడే ‘డీజే టిల్లు’ సినిమా సమయంలో ఆ సినిమాకు అన్నీ తానై పని చేసిన సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. సినిమా టైటిల్ బాలేదని చెప్పిన త్రివిక్రమ్ కొన్ని సూచనలు కూడా చేశారని చెప్పారు. అయితే సితార బ్యానర్ నుండి రీసెంట్‌గా వచ్చిన ‘కింగ్డమ్’, ‘మాస్ జాతర’ సినిమాల కథల విషయంలో త్రివిక్రమ్ సలహాలు తీసుకోలేదా? లేక ఆయన చెప్పినా అవి వర్కవుట్ కాలేదా? అనేది నాగవంశీనే చెప్పాలి.
సితార సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా? ఆ సినిమాలను తెరకెక్కించే బ్యానర్లలో ఒకటైన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ త్రివిక్రమ్ భార్య సౌజన్యకి చెందినదే అనే విషయం తెలిసిందే.