సీనియర్ నటుడు శరత్ బాబు మరణవార్తతో నేడు సినీ పరిశ్రమ అంతా మూగబోయింది. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన శరత్ బాబు… బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది వెల్లడించింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా శరత్ బాబు కు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఆముదాల వలస లో శరత్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు (Sarath Babu) ‘రామరాజ్యం’ సినిమా ద్వారా 1973 సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. శరత్ బాబు హీరోగా, సెకండ్ హీరోగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఆయన గొంతులో ఉన్న గాంభీర్యం ఎటువంటి పాత్రకైనా హుందాతనాన్ని తెచ్చిపెట్టేది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా శరత్ బాబు నటించారు. కెరీర్ ప్రారంభం నుండి ఆయన తన పేరుకు ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్ లు ఉండకూడదు అని భావించేవారు. బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ శరత్ బాబు బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.ఆయన నటించిన ‘అంతరంగాలు’ సీరియల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక శరత్ బాబు పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే.
హాస్య నటి రమాప్రభ శరత్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 15 ఏళ్ళ పాటు వాళ్ళు బాగానే కలిసున్నారు.కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.అటు తర్వాత నంబియార్ కుమార్తె స్నేహను పెళ్లాడారు. ఆమెతో కూడా 11 ఏళ్ళు కాపురం చేసి తర్వాత విడిపోయారు. చివరిసారిగా శరత్ బాబు ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించారు. అయితే శరత్ బాబు నటించిన చివరి చిత్రం ‘మళ్ళీ పెళ్లి’ మే 26న విడుదల కాబోతోంది.