శ్యామ్ బెనగల్ (Shyam Benegal).. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని, గత తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇండియన్ సినిమాలో ఆయన దారి వేరు. యదార్థ గాథలకు దృశ్యరూపం ఇచ్చిన ఆయన.. అలాంటి చిత్రాలు తెరకెక్కించాలని అనుకునే వారికి నిలువెత్తు పుస్తకం ఆయన. అలాంటి మహోన్నత దర్శకుడు తన జీవితం అనే సినిమాకు ఎండ్ కార్డు వేసి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.
ఎన్నో సజీవ దృశ్య కావ్యాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన శ్యామ్ బెనగల్ గురించి ఇప్పటితరం కథలు కథలుగా చెప్పుకోవాలి. అందుకే ఆయన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో ఆయన జీవితం అంతా ఉండదు. సినిమాలకు ఆయనకు మధ్య ఉన్న బంధం, ప్రేమ మాత్రమే ఉంటాయి. అవి చాలు ఆయన గురించి చెప్పడానికి కూడా.
శ్యామ్ బెనగల్ తొలి సినిమా నుండి అవార్డులు రావడం ఆనవాయితీగా మారింది. ఆయన మనసు పెట్టి సినిమా తీస్తే.. అవార్డు మీద పేరు రాసేయాల్సిందే అనేవారు ఆ రోజుల్లో. ఎంతగా అంటే ఆయన తెరకెక్కించిన సినిమాల్లో కేవలం నాలుగింటికే అవార్డులు రాలేదు. ‘నిషాంత్’, ‘భూమిక’, ‘మండి’, ‘హరి భరి’ ఇలా చేసిన సినిమాలు చేసినట్లు జాతీయ పురస్కారాలు, నర్గీస్ దత్ పురస్కాలు అందుకున్నాయి.
ఆరేళ్లప్పుడే సినిమా తీయాలనే కోరిక కలిగిందని చెప్పిన శ్యామ్ బెనగల్.. సినిమాలు తెరకెక్కించడంలో ఎవరి ప్రభావం తనపై ఉండకూడదని సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గరా పని చేయలేదు. ఇక మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసిన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా చేశారు. ఆ సినిమా నిర్మాణంలో రైతులు భాగస్వాములు అయితే బాగుంటుంది అని క్రౌడ్ ఫండింగ్ తరహాలో ఆ సినిమా చేశారు.
ఆ సినిమా కోసం ఐదు లక్షల మంది రైతులు తలో రూ.2 ఇచ్చారు. అలా వచ్చిన డబ్బులతోనే ‘మంథన్’ సినిమా తెరకెక్కించింది. ఇంత ఎక్కువమంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా ‘మంథన్’ ఆ రోజుల్లో రికార్డు సృష్టించింది. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే.
శ్యామ్ బెగనల్ తాను పుట్టి పెరిగిన వాతావరణం, నిజాం కాలం నాటి జన జీవితం నేపథ్యంగా సినిమాలు చేశారు. ఇక్కడి భాష అయిన దక్కనీ ఉర్దూ సంభాషణలతోనే సినిమాలు ఉండేవి. ‘అంకుర్’ని అనుకొన్నది అనుకొన్నట్లుగా తీయడానికి 13 సంవత్సరాలపాటు కష్టపడ్డారు. నటుల్ని ఎంపిక చేయడంలో రాజీపడరని శ్యామ్ బెనెగల్‌కు పేరు. ఆయన ఎంపిక చేసిన నటుల పేర్లు వింటే ఎలాంటి వారిని ఎంపిక చేసుకుంటారో మీకే తెలుస్తుంది.
నసీరుద్దీన్ షా, సాధు మెహర్, ఓంపురి, అమ్రిష్ పురి, అనంత్‌నాగ్, గిరీశ్ కర్నాడ్, షబానా అజ్మీ, స్మితా పాటిల్, ప్రియా తెండుల్కర్, వాణిశ్రీ, పల్లవిజోషి, సులభాదేశ్ పాండే లాంటి వారే శ్యామ్ బెనెగల్ పాత్రలకు ప్రాణం పోసింది. ఇక ఆయన చివరి చిత్రం ‘ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’. బంగ్లాదేశ్ జాతిపిత, ఆ దేశ తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారం ఆ సినిమాను తెరకెక్కించారు శ్యామ్ బెనగల్.
బంగ్లాదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, భారతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ కలసి ‘ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ సినిమాను నిర్మించాయి. 2023లో విడుదలైన ఈ సినిమాకు వివిధ అంతర్జాతీయ పురస్కారాలు కూడా దక్కాయి. ఇటీవలే తన 90వ పుట్టినరోజును జరుపుకున్న శ్యామ్ బెనెగల్ రెండు ప్రాజెక్టుల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన సినీ జగత్తును వదిలేసి వెళ్లిపోయారు.
సినిమాను సినిమాగా తీయడం వేరు. సినిమాను జీవితంగా తీయడం వేరు. రెండో రకం దర్శకుడు శ్యామ్ బెనగల్ (Shyam Benegal). అందుకే ఆయన సినిమాలు ప్రజల్ని ప్రజలకు చూపించాయి. ఇంకా నాటి తరానికి గుర్తున్నాయి. ఆ గుర్తులతోనే ఆయన గుడ్ బై చెప్పేద్దాం. మనసులో గుర్తుంచుకుందాం.