సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు పక్క రాష్ట్రాల సినీ ప్రముఖులు కూడా మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నెలలో చూసుకుంటే.. మలయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) సోదరుడు నందు, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్,మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్ వంటి వారు మరణించారు.
కొందరు అనారోగ్య సమస్యలతో.. ఇంకొంతమంది వయోభారంతో కన్నుమూయడం జరిగింది. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో సీనియర్ దర్శకుడు కన్నుమూశాడనే వార్త వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి (Sabapathy Dekshinamurthy) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 61 ఏళ్ళు అని తెలుస్తుంది. ఈయన్ని తమిళనాడులో ఎక్కువగా ఎస్‌డీ సభా.. అని పిలుస్తూ ఉంటారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఆయన మృతి కోలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని అక్కడి సినీ ప్రముఖులు అంటున్నారు. అలాగే ఎస్‌డీ సభా కుటుంబానికి ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు. విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘భారతన్’ తో దర్శకుడిగా మారిన ఎస్‌డీ సభా..ఆ తర్వాత ‘ఎంగ తంబి’ ‘సుందర పురుషాన్’, ‘వీఐపీ’ వంటి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో కూడా జగపతి బాబు (Jagapathi Babu), కళ్యాణి (Kalyani) జంటగా నటించిన ‘పందెం’ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా సభానే (Sabapathy Dekshinamurthy) అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.