ఫ్యామిలీ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఏ సీజన్లో అయినా ఇలాంటి సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. చాలామంది దర్శకులను స్టార్లను చేసింది ఫ్యామిలీ సినిమాలే. ఆ లిస్టులో కృష్ణవంశీ కూడా ఉంటారు. డెబ్యూ మూవీ ‘గులాబీ’ తో పర్వాలేదు అనిపించినా.. ఆయనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘నిన్నే పెళ్ళాడతా’ అనే చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 29 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) ముందుగా దర్శకుడు కృష్ణవంశీ హీరో నాగార్జునతో ‘సముద్రం’ అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఆ సినిమా కథ నాగార్జునకి వినిపించారు. కానీ నాగార్జునకి ఆ కథ నచ్చలేదు. కానీ కృష్ణవంశీతో పని చేయాలనే కోరిక ఆయనలో ఉంది.
2)మరోపక్క ‘గులాబీ’ సినిమా బాగున్నా.. సెకండాఫ్ లో ‘వయొలెన్స్ ఎక్కువ ఉంది’ అనే కంప్లైంట్ వినిపించింది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మతో కృష్ణవంశీ డైరెక్షన్ ని కంపేర్ చేశారు చాలామంది. అది కృష్ణవంశీకి నచ్చలేదట. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా కాకుండా కృష్ణవంశీగానే పాపులర్ అవ్వాలనేది అతని డ్రీం. అందుకే రాంగోపాల్ వర్మకి ఇష్టం లేని, భవిష్యత్తులో అతను టచ్ చేయడు అనుకునే జోనర్లో సినిమా చేయాలని కృష్ణవంశీ అనుకున్నారు.
3) ఈ క్రమంలో ‘హమ్ ఆప్కే హై కౌన్’ (తెలుగులో ‘ప్రేమాలయం’), ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి సినిమాలు చూశారట కృష్ణవంశీ. అప్పుడు ఆయన కచ్చితంగా ఓ ఫ్యామిలీ డ్రామా చేయాలని డిసైడ్ అయ్యారట. అలాంటి జోనర్ల జోలికి రాంగోపాల్ వర్మ పోడు అనేది కృష్ణవంశీ నమ్మకం.వెంటనే ‘నిన్నే పెళ్ళాడతా’ కథపై వర్క్ చేయడం స్టార్ట్ చేశారట.
4) ఒకసారి హైదరాబాదులో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్లో ‘రాముడొచ్చాడు’ షూటింగ్లో నాగార్జున పాల్గొంటున్నారు. ఆ టైంలో వెళ్లి నాగార్జునని కలిస్తే.. ఆయన కృష్ణవంశీకి 15 నిమిషాలు టైం ఇచ్చారట. ‘ఈ 15 నిమిషాల్లో నువ్వు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటే పూర్తిగా కథ వింటా.. లేదు అంటే నా టైం వేస్ట్ చేయకు.. నువ్వు ఇబ్బంది పడకు’ అని డైరెక్ట్ గా చెప్పేశారట నాగ్.
5)ఆ తర్వాత వెంటనే కృష్ణవంశీ ‘నిన్నే పెళ్ళాడతా’ కథని చెప్పడం స్టార్ట్ చేశారట. అయితే కృష్ణవంశీ కథ చెప్పడం మొదలుపెట్టిన 3 నిమిషాలకే నాగార్జున కనెక్ట్ అయిపోయారట. డౌట్లు అడగడం మొదలుపెట్టారట. అలా నాగార్జున తెలీకుండానే 45 నిమిషాలు కృష్ణవంశీతో స్పెండ్ చేసి.. తర్వాత ఒకసారి పూర్తి కథతో ఇంటికి రమ్మని చెప్పారట.
6) కృష్ణవంశీ నాగార్జున వద్దకు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ‘శీను పండు’ అనే టైటిల్ తో కథ చెప్పారట. తర్వాత 15 రోజుల్లో కథ మొత్తం రెడీ చేసి నాగార్జున వద్దకు వెళ్లి వినిపించారట. అప్పుడు నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ అనే టైటిల్ వచ్చేలా కొన్ని రిఫరెన్సులు ఇచ్చారట. అలా ఆ టైటిల్ ఫైనల్ అయ్యింది.
7) నాగార్జునకి కథ బాగా నచ్చేసింది. కొంతమంది నిర్మాతలకు రిఫర్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదట. దీంతో స్వయంగా నాగార్జున నిర్మాతగా మారి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత షూటింగ్ మొదలైంది.. నెల రోజుల్లో చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసేశారు. కాకపోతే క్లైమాక్స్ పై ఎందుకో నాగార్జునకి డౌట్ వచ్చిందట. ముందుగా అనుకున్న క్లైమాక్స్ లో శీను, పండు సూసైడ్ చేసుకుంటున్నట్టు కామెడీ చేసి పెద్దవాళ్ళను కన్విన్స్ చేసుకున్నట్లు ఉంటుందట. అయితే అక్కడ సీరియస్ గా ఉంటేనే ఎమోషన్ పండుతుంది లేదు అంటే ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు అని భావించి నాగార్జున మళ్ళీ క్లైమాక్స్ మార్పించారట.
8) హీరోయిన్ పాత్ర కోసం కృష్ణవంశీ ఏకంగా 65 అమ్మాయిలని ఆడిషన్ చేశారట. ఓ దశలో హీరోయిన్ మీనాని ఫిక్స్ చేయాలని అనుకున్నారట. కానీ ‘కూలి నెంబర్ 1’ చూశాక టబు నాగార్జున పక్కన ఫ్రెష్ ఫేస్ గా బాగుంటుంది అని కృష్ణవంశీ డిసైడ్ అయ్యారట. తర్వాత ఆమెను ఫైనల్ చేయడం జరిగింది.
9)ఈ సినిమాతో సందీప్ చౌతా సంగీత దర్శకుడిగా డెబ్యూ ఇచ్చాడు. ‘నిన్నే పెళ్ళాడతా’ లో పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటికీ వీటిని వినే ప్రేక్షకులు ఎక్కువ మందే ఉన్నారు.
10) ‘నిన్నే పెళ్ళాడతా’ కి వైవిఎస్ చౌదరి, అతని భార్య గీత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు.ఈ సినిమా టైంలోనే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది.
11) మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో హీరోయిన్ టబుని ఏడిపించే ఆకతాయి పాత్ర చేశాడు. అది చిన్న కేమియో కావడం విశేషం.
12) 1996 అక్టోబర్ 4న ‘నిన్నే పెళ్ళాడతా’ రిలీజ్ అయ్యింది. మొదట్లో సినిమాకి పెద్దగా బజ్ లేదు. కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో ఈవెనింగ్ షోల నుండి హౌస్ ఫుల్స్ తో థియేటర్స్ ప్యాక్ అయ్యాయి. తర్వాత రోజు రోజుకీ థియేటర్లు పెరుగుతూనే వచ్చాయి.
13) మొత్తంగా 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆల్ టైం రికార్డులు సృష్టించింది ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా. అంతేకాదు 4 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు కూడా ఆడింది.
14)’నిన్నే పెళ్ళాడతా’ సినిమా రూ.2 కోట్ల బడ్జెట్లో రూపొంది బాక్సాఫీస్ వద్ద.. రూ.12.5 కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. అప్పటివరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న ‘పెదరాయుడు’ సినిమా కలెక్షన్స్ ని అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా.
15) ఈ సినిమాకి గాను నాగార్జున బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.