తెలుగు చలనచిత్ర చరిత్రలో నటరత్న ఎన్టీఆర్ నటించిన ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవితంలో ఎంత సంపాదించినా.. ఎన్ని పూజలు చేసినా.. మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ లేదని చాటిన చిత్ర రాజం ఈ ‘పాండురంగ మహత్మ్యం’.. 1957 నవంబరు 28న విడుదలైన ఈ ఆపాత మధురం నాటి ప్రేక్షక లోకాన్ని తన్మయత్వంలో ముంచెత్తింది. తరాలు మారుతున్నా తెలుగు సినీలోకంలో ఉత్తమ చిత్రంగా సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. 2022 నవంబర్ 28 నాటికి ఈ చిత్రం 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ‘పాండురంగ మహత్మ్యం’ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే సందేశంతో ఈ పురాణ గాథ తెరకెక్కింది.. మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పే చిత్రమిది. ఎన్టీఆర్ పుండరీకుడిగా నటించారు. జల్సారాయుడిగా ఉన్న ఈ పాత్ర తర్వాత మంచిగా మారుతుంది. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటే ముక్తి దొరుకుతుందని చూపించారు. పుండరీకుడు భగవంతుడిలో ఐక్యమయ్యే సన్నివేశంలో తమిళ్, హిందీ, కన్నడ మరియు మరాఠీ గీతాలు వినిపిస్తాయి. తారక రాముడి నటనావైైభవాన్ని చాటి చెప్పింది. ఇతర ముఖ్య పాత్రల్లో అంజలీ దేవి, చిత్తూరు నాగయ్య, బుష్యేంద్రమణి, బి.పద్మనాభం, బి.సరోజా దేవి, విజయ నిర్మల తదితరులు నటించారు.
ఎన్.ఎ.టి. పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మించగా.. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. అప్పటికి ఎన్టీఆర్‌తో కామేశ్వర రావు ‘చంద్రహారం’, ‘పెంకి పెళ్లాం’ అనే రెండు డిజాస్టర్స్ ఇచ్చారు. దీంతో దర్శకుడిగా ఆయన వద్దని సన్నిహితులు చెప్పినా వినకుండా.. ఆయన ప్రతిభ మీద నమ్మకంతో ఎన్టీఆర్ మళ్లీ ఈ సినిమా అవకాశమిచ్చారు. ఆయన నమ్మకమే నిజమైంది. చిత్రం అఖండ విజయం సాధించడమే కాక అజరామరంగా నిలిచిపోయింది.
కొత్త వారు పరిచయమయ్యారు..
చిత్రానికి మాటల రచయితగా సముద్రాల జూనియర్‌ని నియమించుకున్నారు. అప్పటికి పాటల రచయితగానే పేరొందిన ఆయనకు ఇది మాటల రచయితగా తొలిచిత్రం. అలాగే అప్పటి వరకు కన్నడ చిత్రాలతో పేరొందిన బి.సరోజా దేవి ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె కళావతి అనే వేశ్య పాత్ర చేశారు. విజయ నిర్మల బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. 11 ఏళ్ల వయసులో బాలకృష్ణుడి పాత్రలో కనిపించారామె.
అమోఘం.. ఘంటసాల గాత్రం..
ఈ చిత్రానికి టి.వి. రాజు సంగీతమందించారు. ఘంటసాల, పి.సుశీల, పి.లీల, చిత్తూరు నాగయ్య పాటలు పాడారు. ఇందులో ఘంటసాల ఆలపించిన ‘హే కృష్ణా ముకుందా మురారి’ పాట ఏకంగా 15 నిమిషాల నిడివి ఉంటుంది. ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది. నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. బరువైన సమాసాలతో కూడిన శ్లోకాలను నటరత్న ఒకే టేక్‌లో ఓకే చేశారట.
ఏకధాటిగా ఆరు నెలలు ఆడింది..
ఎన్టీఆర్ నటించిన 61 సినిమా ఇది.. అప్పట్లో ఈ చిత్ర నిర్మాణానికి రూ.4 లక్షలు బడ్జెట్ పెట్టారు.. సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివి ఉంటుంది. ‘పాండురంగ మహాత్మ్యం’ అప్పట్లో తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని సంచలనం సృష్టించింది. అలాగే విజయవాడ, గుంటూరులో 24 వారాలపాటు ప్రదర్శితమై సరికొత్త రికార్డు నెలకొల్పింది..
బాలయ్య ‘పాండురంగడు’..
ఇదే కథతో (కొన్ని మార్పులు) ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘పాండురంగడు’.. కమాలాకర కామేశ్వర రావు శిష్యుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో వచ్చింది. బాలయ్య.. శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా నటించాడు. ‘పాండురంగ మహత్మ్యం’ తో పోల్చడానికి వీలు పడనంతగా ఈ చిత్రం పరాజయం పాలైంది..