పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమా చాలా స్పెషల్. దాదాపు 10 ఏళ్ళ పాటు సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కి.. పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్న సినిమా ఇది. ముఖ్యంగా పవన్ అభిమానుల ఆకలి తీర్చింది అని చెప్పాలి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. అలాంటి చిత్రానికి సీక్వెల్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) వచ్చింది. అయితే ఇది రీమేక్ కాదు. దర్శకుడు కూడా హరీష్ కాదు. బాబీ (K. S. Ravindra) డైరెక్ట్ చేశాడు. ‘ఈరోజ్ ఇంటర్నేషనల్’ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థల పై శరత్ మరార్ (Sharrath Marar), సునీల్ లుల్లా, పవన్ కళ్యాణ్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్ 8 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా వచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్. అయితే ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ 23 వ సినిమాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మొదలైంది. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడిగా సంపత్ నంది (Sampath Nandi) ఎంపికయ్యాడు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల సంపత్ నంది ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దీంతో దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఈ లోపు పవన్ కళ్యాణ్ ‘ఓ మై గాడ్’ రీమేక్ అయిన ‘గోపాల గోపాల’ ని (Gopala Gopala) కంప్లీట్ చేశారు.
2) పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్లో ఉన్నప్పుడే రవితేజ (Ravi Teja) ‘పవర్’ (Power) సినిమా రిలీజ్ అయ్యింది. బాబీ కొల్లి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాని బాబీ తీసిన విధానం పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రాజెక్టు కోసం పవన్ సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తున్న టైంలో రైటర్ కోన వెంకట్ సలహా మేరకు బాబీని పిలిచి మాట్లాడారు పవన్ కళ్యాణ్.
3) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథ, స్క్రీన్ ప్లే.. రెండూ కూడా పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిందే. కానీ పవన్ ఇమేజ్ కి తగ్గట్టు బుర్రా సాయి మాధవ్ తో (Sai Madhav Burra) కలిసి కొన్ని డైలాగ్స్ బాబీ డిజైన్ చేయించుకున్నారు. ఆ తర్వాత వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోయింది ఈ సినిమా.
4) ఈ సినిమాలో పవన్ సరసన జోడీగా అనీష అంబ్రోస్ ను ( Anisha Ambrose) అనుకున్నారు. కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆమె సెట్ అవ్వలేదు అని భావించి పక్కన పెట్టారు. తర్వాత ఆమె ప్లేస్లో కాజల్ అగర్వాల్ ను (Kajal Aggarwal) తీసుకున్నారు.
5) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాని 94 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ మీటింగుల వల్ల.. షూటింగ్ డిలే అయ్యింది. 2014 చివర్లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా 2016 వరకు ఆలస్యమవుతూ వచ్చింది.
6) సంగీత దర్శకుడిగా ముందు తమన్ ను (S.S.Thaman) తీసుకోవాలి అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్… సూచన మేరకు దేవి శ్రీ ప్రసాద్ నే ఫైనల్ చేశారు. ఈ సినిమాలో దేవి ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేసిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టైటిల్ సాంగ్, ‘ఓ పిల్లా’ వంటి పాటలు చాలా బాగుంటాయి.
7) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ ‘ఇంద్ర’ (Indra) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చేసిన వీణ స్టెప్ వేయడం విశేషంగా చెప్పుకోవాలి.
8) ఈ సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. తర్వాత బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నారు. ఆ రకంగా పవన్ కి రూ.30 కోట్ల వరకు పారితోషికం అందింది.
9) కానీ రిలీజ్ తర్వాత సినిమా డిజాస్టర్ అవ్వడం.. బయ్యర్స్ కి నష్టాలు రావడంతో, రూ.15 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ వెనక్కి ఇవ్వడం జరిగింది.
10) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మొదటి రోజు ఆంధ్రలో రూ.15 కోట్ల(గ్రాస్) ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. దీనికి ముందు ‘బాహుబలి'(ది బిగినింగ్) (Baahubali) చిత్రం రూ.14.2 కోట్లు(గ్రాస్) ను కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఆంధ్రాలో ‘బాహుబలి’ రికార్డుని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్రేక్ చేసినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది చెప్పడంలో అతిశయోక్తి లేదు.