స్టార్ ఫ్యామిలీ నుండి వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమి కాదు. 5,6 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్టార్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… సక్సెస్ అయిన వాళ్ళ జాబితా కూడా చాలా తక్కువ. నిజానికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే సినీ పరిశ్రమలో ఈజీగా ఎంట్రీ ఇవ్వొచ్చేమో కానీ నిలదొక్కుకోవడం అనేది పూర్తిగా వారి స్వయంకృషిని బట్టి ఉంటుంది. చాలా మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలానికే ఫేడౌట్ అయిపోయారు.
అలాంటి వారి లిస్ట్ తీసుకుంటే తారకరత్న, ఆర్యన్ రాజేష్, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు వంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్ట్ లోనే సిద్దార్థ్ రాజ్ కుమార్ కూడా ఉన్నాడన్న సంగతి ఎక్కువ మందికి తెలీదు. ఇతను కృష్ణంరాజు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ప్రభాస్ కు కజిన్.. తమ్ముడి వరస. సిద్ధార్థ్ రాజ్ కుమార్ 2011 మార్చి 14న వచ్చిన ‘కెరటం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.అంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమాలో చిన్నప్పటి మహేష్ గా కనిపించాడు.
చూడటానికి చాలా అందంగా ఉండే ఈ కుర్రాడు ఎందుకో హీరోగా రాణించలేకపోయాడు. ఇక ‘కెరటం’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. గౌతమ్ పట్నాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.వి.బాబు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ మూవీ వీకెండ్ కే దుకాణం సర్దేసింది.
అయితే సిద్దార్థ్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడం కోసం కృష్ణంరాజు, ప్రభాస్ లు వచ్చి తమ బెస్ట్ విషెస్ చెప్పిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజుతో ‘కెరటం’ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు కావస్తున్న సమయంలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే సిద్దార్థ్ ఈ సినిమాతో క్లిక్ అవ్వలేదు కానీ హీరోయిన్ రకుల్ మాత్రం రెండేళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది.