బాలయ్య కెరీర్లో 2వ ఇండస్ట్రీ హిట్… 33 ఏళ్ళ ‘ముద్దుల మావయ్య’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు చిత్ర సీమలో ఎన్నో క్రేజీ కాంబినేషన్‌లు ఉన్నాయి. డైరెక్టర్లు- హీరోలు, హీరోలు- హీరోయిన్లు, హీరోలు- సంగీత దర్శకులు ఇలా ఫలానా జంట కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేస్తుంది అంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ప్రేక్షకుల్లో గట్టిగా పడిపోయింది. అలాంటి వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ- కోడి రామకృష్ణ కాంబో. ‘మంగమ్మగారి మనవడు’ తో వీరి ప్రస్థానం ప్రారంభమైంది. వీరిద్దరి కలయికలో మొత్తంగా 7 సినిమాలు తెరకెక్కితే.. అందులో ఆరు బ్లాక్ బస్టర్‌లైతే , ఒకటి మాత్రమే నిరాశపరిచింది. వీటిలో ఒక బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముద్దుల మావయ్య’.అంతే కాదు ఇది ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా. ఈ సినిమా రిలీజ్ అయ్యి 33 సంవత్సరాలు గడుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం :

1) 1989 ఏప్రిల్ 7 న విడుదలైన ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకుంది. పలు కేంద్రాల్లో ఏడాదికి పైగా ప్రదర్శింపబడి సంచలనం సృష్టించింది. అంతేకాదు వన్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌ లలో ఒకటి అని ఇందాక చెప్పుకున్నాం.

2) ముద్దుల మావయ్య’ చిత్రాన్ని ‘భార్గవ్ ఆర్ట్స్’ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించారు. భార్గవ్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఇది బాలయ్య నటించిన నాల్గో చిత్రం. గతంలో ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మువ్వ గోపాలుడు’ సినిమాలు చేశారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే ‘ముద్దుల మేనల్లుడు’ .. అనంతరం ‘మాతో పెట్టుకోకు’ సినిమాల్లో నటించారు బాలయ్య. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో చివరగా బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ’విక్రమసింహ భూపతి’ పట్టాలెక్కింది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో ఆగిపోయింది. తర్వాత ఆయన వారసులు కూడా ఈ ప్రాజెక్టుని టేకాఫ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు.

3) ‘ముద్దుల మావయ్య’ చిత్రం తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘ఎన్ తంగాచి పడిచావా’ మూవీకి రీమేక్‌. దీనిని హిందీలో అమితాబ్ బచ్చన్ ‘ఆజ్ కా అర్జున్’గా, కన్నడలో ‘రవి మామ’గా.. బెంగాలీలో ‘పబిత్ర పాపి’గా రీమేక్ చేశారు.

4) అప్పట్లో ‘మ’ అక్ష‌రంతో మొద‌లై టైటిల్‌ గా పెట్టిన సినిమాలు బాలయ్యకు బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చాయి. ఈ సెంటిమెంట్ ‘ముద్దుల మావయ్య’ విషయంలో కూడా నిజమైంది.

5) కోడి రామకృష్ణ విషయానికొస్తే.. బాలయ్యకు తొలి 100 రోజులు, 200 రోజులు, తొలి సిల్వర్ జూబ్లీ, తొలి గోల్డెన్ జూబ్లీ, వంటి సినిమాలను ఇచ్చిన దర్శకుడిగా రికార్డులకు ఎక్కారు. బాలయ్య ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకున్న దర్శకుల్లో ఈయన ముందుంటారు.

6) భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్‌రెడ్డి.. తొలిసారి కోడి రామకృష్ణ కాకుండా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘మాతో పెట్టుకోకు’ తీస్తే దారుణంగా ఫెయిల్ అయ్యింది. గోపాల్ రెడ్డి కి భారీ నష్టం వచ్చింది.

7) బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో 17 సినిమాలు వస్తే.. అన్ని బ్లాక్ బస్టర్‌లే, ఈ జోడీకి ‘ముద్దుల మావయ్య’ లోనూ రుజువైంది.

8) ఈ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ అనే పాట అప్పట్లో ఓ చార్ట్ బస్టర్. ఇప్పటికీ ఆ పాట ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. కె.వి.మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

9) ఈ చిత్రానికి కథ అందించింది ‘చంద్రముఖి’ ఫేమ్ పి.వాసు అని ఎక్కువ మందికి తెలిసుండదు. ఈ మూవీ తర్వాత ఆయన రైటర్‌గా, దర్శకుడిగా ఫుల్ బిజీ అయ్యారు. కొన్నాళ్ళకి ఆయన బాలయ్యతో ‘మహారథి’ అనే చిత్రం తీశారు.కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

10) ‘ముద్దుల మావయ్య’ ఆ రోజుల్లోనే రూ.5.5 కోట్ల కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా మూవీగా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus