సినారె గురించి ఆసక్తికర సంగతులు

లలిత గేయాలు, వచన కవితలు, గజల్స్, సినిమా పాటలు ఇలా ఒకటేమిటి తెలుగు సాహిత్యంలో అన్ని రకాలుగా ప్రయోగాలు చేసి అభినందనలు అందుకున్నారు ప్రముఖ రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి. సినారె గా గుర్తింపు సాధించుకున్న ఈయన సోమవారం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ పాటల రూపంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్న మహాకవి గురించి మీకు తెలియని సంగతులు..

రైతు బిడ్డకరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటకు చెందిన మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు 1931, జూలై 29న సి.నారాయణరెడ్డి జన్మించారు. మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు.

వీధి బడి నుంచి ఉస్మానియా నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ, పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు.

రెండు భాషల్లో..విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. తెలుగుతో పాటు ఉర్ధూ, హిందీలో రచనలు చేశారు.

అధ్యాపకుడిగాసికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందారు.

ఆనాడు.. ఈనాడు సినారె కాలానికి అనుగుణంగా పాటలు రాసి మెప్పించగలరు. 1962 లో వచ్చిన గులేబకావళి కథ కోసం 11 పాటలను రాసారు. అందులో ప్రతి ఒక్కటి ఆణిముత్యమే. ఇక 2009 లో వచ్చిన అరుంధతి లో “కమ్ముకున్నా చీకట్లోనా(జేజెమ్మ)” పాటను రాసి యాభై ఏళ్ళు గడిచినా తన కలానికి పదును తగ్గ లేదని నిరూపించారు. తన జీవితంలో 3500 గీతాలు రచించారు.

పురస్కారాలు 1977లో ప‌ద్మ‌శ్రీ ,1992లో ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న సినారె కి.. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారం వరించింది. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, భారతీయ భాషా పరిషత్‌, రాజ్యలక్ష్మీ పురస్కారం, సోవియట్‌-నెహ్రూ వంటి ఎన్నో పురస్కారాలు సినారె కలానికి సలాం చేశాయి.

రాజ్యసభ సభ్యునిగా.. సినారెను భారత రాష్ట్రపతి 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేశారు. రాజ్యసభ సభ్యునిగా కరీంనగర్‌ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

భార్య, పిల్లలు సినారె జీవిత భాగస్వామి పేరు సుశీల. వీరికి నలుగురు సంతానం. నలుగురు అమ్మాయిలకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని నదుల పేర్లు పెట్టుకున్నారు. కూతుళ్లతో పాటు మనవళ్లు, మన్నవరాళ్లు కూడా సాహిత్య ప్రియులే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus