బిగ్ బాస్ విన్నర్ సన్నీ, స్టార్ కమెడియన్ సప్తగిరి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అన్ స్టాపబుల్’. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ వారి కోసం హోస్ట్ గా చేసిన ప్రోగ్రాం పేరు పెట్టుకుని.. ఈ సినిమాకి బాగా హైప్ తెచ్చుకున్నారు. ‘బుర్రకథ’ ‘సన్ ఆఫ్ ఇండియా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘ఈడోరకం ఆడోరకం’ వంటి హిట్ సినిమాలకి కూడా పనిచేశాడు. మరి ఈ సినిమా బాలయ్య బాబు టాక్ షోలా సక్సెస్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకుందాం రండి :
కథ : సప్తగిరి, విజె సన్నీ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే పనిచేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కొన్ని కారణాల వల్ల వీళ్ళకి డబ్బు అవసరం పడుతుంది. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా వీరికి డ్రగ్స్ దొరుకుతాయి. వీటి కోసం ఒక పక్క క్రిమినల్స్ మరో పక్క పోలీసులు గాలిస్తూ ఉంటారు. ఇవి హీరోల దగ్గరే ఉన్నాయని వారికి తెలుస్తుంది. మరి వాళ్ళ నుండి చిచ్చా, మచ్చా(సన్నీ, సప్తగిరి) లు ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : విజె సన్నీ నిజజీవితంలో కూడా చాలా ఫన్నీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటాడు.ఈ సినిమాలో కూడా తన మార్క్ కామెడీ ప్రదర్శించాలి అని చాలా ట్రై చేశాడు. ఫైట్స్, డ్యాన్స్ విషయంలో కూడా ఓకే అనిపించాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఇంకా బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నట్టు ఇబ్బంది పడ్డాడు. సప్తగిరి హీరోగా చేసినా కామెడీ విషయంలోనే ఎక్కువగా హైలెట్ అయ్యాడు. హీరోగా బిహేవ్ చేయాల్సిన చోట .. కొంచెం ఎక్కువ అతి చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది.
ఇక నక్షత్ర జస్ట్ ఓకే అనిపించింది. మరో హీరోయిన్ అక్స తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న కమెడియన్స్ లో 80 శాతం ఈ సినిమాలో నటించారు. కానీ అందరి పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి రిజిస్టర్ కావు. అలాగే ఆ పాత్రల నుండి కామెడీ ఎక్కువగా పండలేదు అనే చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు : డైమండ్ రత్నబాబు .. రైటర్ గా చేసిన సినిమాల్లో రెండు మూడు సక్సెస్ అయ్యాయి. అందుకే అతనికి చాలా ఫాస్ట్ గా డైరెక్షన్ ఛాన్స్ లు లభించాయి. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా ఆయన ఉపయోగించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇలాంటి కథలు ఇవివి సత్యనారాయణ సినిమాల్లో, ఆయన తనయుడు అల్లరి నరేష్ సినిమాల్లో చాలా సార్లు చూశాం. అవి టీవీల్లో, యూట్యూబ్ లో అందరికీ అందుబాటులోనే ఉన్నాయి.
అలాంటప్పుడు అతను అలాంటి కథలతోనే ఇంత సిల్లీ మూవీ ఎలా తీశాడో అర్థం కాదు. సినిమాలో రెండు ట్విస్ట్ లు ఉంటాయి. అవి జస్ట్ కొంచెం రిలీఫ్ ఇస్తాయి. ఇక భీమ్స్ అందించిన సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలెట్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఆ తర్వాత వేణు మురళీధర్ కెమెరా వర్క్ గురించి చెప్పుకోవాలి. ఈ రెండు హైలెట్ పాయింట్స్ కి మించి అయితే ‘అన్ స్టాపబుల్’ అనేంతలా ఈ సినిమాలో ఏమీ లేదు.
విశ్లేషణ : కామెడీ ప్రధానాంశంగా రూపొందిన (Unstoppable) ఈ మూవీ .. కామెడీ లవర్స్ ని కూడా విసిగించే విధంగా ఉంది. అనేక బోరింగ్ పోర్షన్స్ ని తట్టుకోగలము అనుకునే ప్రేక్షకులు తప్ప.. మిగిలిన వాళ్ళు నిస్సందేహంగా లైట్ తీసుకోవచ్చు.
రేటింగ్ : 1.5/5