అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించడం భారతీయ సినిమా (Indian Cinema) ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు, హిందీ, తమిళ చిత్రాలు గత కొన్నేళ్లుగా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. కానీ, ఈ టారిఫ్ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లను ఇరకాటంలోకి నెట్టనుంది. ఒక సినిమాను 1 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తే, అదనంగా 1 మిలియన్ డాలర్లు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల టికెట్ ధరలు పెరిగి, ఎన్ఆర్ఐలు థియేటర్లకు రావడం తగ్గే ప్రమాదం ఉంది.
2025లో ‘వార్ 2’(War 2) , ‘కూలి’(Coolie), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)లాంటి ప్యాన్ ఇండియా చిత్రాలు అమెరికా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. కానీ, ఈ టారిఫ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు రెట్టింపు కావడంతో నిర్మాతలు లాభాలను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే టైర్-2 హీరోల సినిమాలు అమెరికాలో ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. ఈ నిర్ణయం ఓవర్సీస్ మార్కెట్‌ను మరింత కుదేలు చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ టారిఫ్ నియమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తిస్తే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి యాప్‌లు భారతీయ సినిమాల కొనుగోలును తగ్గించే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ నిర్ణయం అమలైతే, భారతీయ సినిమాల ఓవర్సీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడనుంది.
ముఖ్యంగా హాలీవుడ్ మార్కెట్ పై మిగతా దేశాల సినిమాల ప్రభావం పడుతుందని, మార్కెట్ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, అలాగే కొందరు కుట్ర పన్నుతున్నట్లు కూడా ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.