‘ఓజీ’ సినిమా సీక్వెల్ ఉంటుంది అని ఇప్పటికే చెప్పేశారు. సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లోనే సుజీత్ చెప్పినా.. పవన్ కల్యాణ్ ఓకే చెబుతారా? చెబితే ఎప్పుడు చెబుతారు అనే ప్రశ్నలు అయితే ఉండేవి. అయితే సినిమా సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ సీక్వెల్ గురించి చెప్పడంతో ఫిక్స్ అయిపోయింది. అయితే ఎప్పుడు, ఏంటి అని చెప్పలేదు. ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందు చాలా మార్పులు జరుగుతాయి అని అంటున్నారు.
ప్రస్తుతం సుజీత్ తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాని హీరోగా రూపొందనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల అయిన తర్వాతే ‘ఓజీ 2’ సినిమా పనులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లోపు పవన్ కల్యాణ్ తన పనులు అన్నీ పూర్తి చేసుకొని ఖాళీ అవ్వాలి. ప్రస్తుతం వస్తున్న పుకార్ల ప్రకారమైతే ఈ రెండే కాదు.. మరో విషయంలోనూ క్లారిటీ రావాలట. అదే సినిమా నిర్మాణ సంస్థ.
అవును, మీరు చదివింది కరెక్టే. ‘ఓజీ 2’ సినిమా కోసం నిర్మాణ సంస్థ మారుతుంది అని అంటున్నారు. తొలి సినిమాను తీసిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ రెండో పార్ట్ కోసం రెడీగా లేరట. ఆ ప్లేస్‌లో యూవీ క్రియేషన్స్ ముందుకొస్తోందని సమాచారం. నిజానికి యూవీ క్రియేషన్స్ – పవన్ కల్యాణ్ కాంబినేషన్ చాలా ఏళ్లుగా చర్చల్లో ఉంది. యూవీ టీమ్ సినిమాల నిర్మాణంలోకి వచ్చినప్పటి నుండి పవన్‌తో సినిమా గురించి చూస్తోంది. ఇప్పుడు సీక్వెల్ రూపంలో ఆ అవకాశం దొరికింది అని చెబుతున్నారు.
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. అదే సుజీత్ – యూవీ క్రియేషన్స్ మధ్య ఉన్న అనుబంధం. ఈ బ్యానర్‌లో సుజీత్ ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలు చేశారు. ఈ రెండు అంశాల వల్ల రెండో ‘ఓజీ’ ఇటువైపు రావొచ్చు అని చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.