యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ విషయంలో అతడి మేనమామ పవన్ కళ్యాణ్ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నారు. మంచి గైడెన్స్, ట్రైనింగ్ ఇచ్చి హీరోను చేశాడు పవన్ కళ్యాణ్. అక్కడే మావయ్య పాత్ర అయిపోయిందని చెబుతున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రతి నిర్ణయం తనే తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తన కథల ఎంపిక విషయంలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ ప్రమేయం కూడా ఉండదని చెబుతున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతానికైతే తన మనసుకి నచ్చిన కథలతోనే ముందుకు వెళ్తున్నానని..
హీరోగా క్లిక్ అవ్వకపోతే మరో పని చేసుకుంటానని ఓపెన్ గా చెబుతున్నాడు వైష్ణవ్ తేజ్. నిజానికి హీరో అవుదామనుకోలేదని.. తెరవెనుక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ లాంటిది చేద్దామనుకున్నానని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు. కొన్ని కథలు కూడా రాశానని అన్నారు. కానీ అంత క్రియేటివిటీ తన వల్ల కాదని ఆపేశానని తెలిపాడు. ప్రస్తుతానికైతే నటుడిగా కెరీర్ బాగుందని.. ఇది క్లిక్ అవ్వకపోతే మరో పని చేసుకుంటానని.. అందులో మొహమాటం లేదని అన్నాడు.
ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. శుక్రవారం నాడు రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.