తెలుగు అమ్మాయిలని టాలీవుడ్లో ఎదగనివ్వరు, వాళ్లకి హీరోయిన్ ఛాన్సులు రావు అంటూ చాలామంది గతంలో స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో ఇది నిజమే అని ఆడియన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. కానీ అడపాదడపా కొంతమంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా అవకాశాలు పొందుతున్నారు. కానీ నిలబడలేకపోతున్నారు, రాణించలేకపోతున్నారు అనేది కూడా ఎప్పటి నుండో ఉన్న టాకే. అయితే మొత్తానికి ఒక తెలుగమ్మాయి కోటి పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్లడం విశేషంగా చెప్పుకోవాలి.
ఆమె మరెవరో కాదు వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత ‘అల వైకుంఠపురములో’ ‘వరుడు కావలెను’ వంటి చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు పొందింది. తర్వాత ఈమె ‘బేబీ’ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో వైష్ణవికి (Vaishnavi Chaitanya) కుర్ర కారు అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమా దాదాపు వంద కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఇప్పుడు మరో వంద కోట్ల హీరో అయిన సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘జాక్’ అనే సినిమాలో నటిస్తుంది.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ’90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు వైష్ణవి (Vaishnavi Chaitanya) పారితోషికం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఇటీవల సైన్ చేసిన ఓ అప్ కమింగ్ మూవీకి గాను నిర్మాత కోటి రూపాయలు పారితోషికం ఆఫర్ చేశారట. ఆ సినిమాలో కూడా వైష్ణవి మెయిన్ రోల్ అట. సినిమా కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుందట. కాల్షీట్లు వంటివి కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందట. అందుకే వైష్ణవికి అంత మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా తెలుగు అమ్మాయి కోటి రూపాయలు పారితోషికం తీసుకునే రేంజ్ కి వెళ్లడం చిన్న విషయం కాదు.