వరుణ్ తేజ్ హీరోగా పరిచయం చేయాలనుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. అప్పట్లో అది జరగకపోయినా ‘ఫిదా’ సినిమాతో ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. 2014లో బాలీవుడ్ ‘కహాని’ని ‘అనామిక’గా రీమేక్ చేసిన శేఖర్ కమ్ముల సుమారు రెండేళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఇది. మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్నా అవి సెట్స్ మీదికి వెళ్ళలేదు. దాంతో ఈ సినిమా అయినా వీలైనంత త్వరగా పూర్తి చేద్దామనుకున్నారు ఈ టాలెంటెడ్ డైరక్టర్. అయితే అది కూడా జరిగేలా లేదట. దీనికి కారణం వరుణ్ తేజ్ అని తెలుస్తోంది.
వరుణ్ ‘ఫిదా’ కంటే ముందు శ్రీను వైట్ల ‘మిస్టర్’ సినిమా ఒప్పుకున్న సంగతి తెల్సిందే. అయితే షూటింగ్ ఆలస్యమవడంతో రెండు సినిమాలు దాదాపు ఒకేసారి పట్టాలెక్కాయి. దాంతో ఈ రెండు సినిమాలు విడుదల కూడా ఒకేసారి కావొచ్చన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల మిస్టర్ షూట్ లో వరుణ్ ప్రమాదానికి గురవడంతో సీన్ మొత్తం మారిపోయింది. వైద్యులు అయిదు వారాల విశ్రాంతి తప్పనిసరని చెప్పారట. దాంతో ఫిదా షూటింగ్ లో పాల్గొనాల్సిన వరుణ్ పరుపుపై పడుకోవాల్సిన పరిస్థితి. కోలుకున్నాక కూడా ‘ఫిదా’ని కాదని ‘మిస్టర్’ షూటింగ్ కే వెళ్లాలని వరుణ్ నిర్ణయించుకున్నడట. ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న మిస్టర్ ని పూర్తి చేసేస్తే తర్వాత పూర్తిగా ‘ఫిదా’ సినిమాకి సమయం కేటాయించ వచ్చన్నది వరుణ్ ఆలోచన. అంచేత వరుణ్, సాయి పల్లవి కాంబినేషన్ కి ప్రేక్షకులు ‘ఫిదా’ అవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది మరి.