ఈమధ్య నిర్మాతల పరిస్థితి రైతుల కంటే దారుణంగా మారింది. పంట పండించిన రైతు.. తాను పెట్టిన ఖర్చుకి కనీసం 10% లాభం లేదా పట్టిన ఖర్చు వెనక్కి వచ్చినా చాలు అని ఎలా అనుకొంటాడో.. అదే తరహాలో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు కూడా తాము పెట్టిన బడ్జెట్ లో సగం వచ్చిన చాలు అనుకొంటున్నారు. ఒక్కోసారి లాభాలు రాకపోయినా కేవలం సినిమా మీద ఫ్యాషన్ తో వరుసబెట్టి సినిమా చేస్తుంటారు కొందరు నిర్మాతలు. అయితే.. నిర్మాతలకు సినిమా రిలీజ్ కి ముందే లాభాలు రావడం అనేది ప్రస్తుతం కల లేదా ఊహ అనుకోవాలి. మరి మన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు నక్క తోక తొక్కారో ఏమో కానీ ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం “తొలిప్రేమ” ఆలిండియా హక్కులను దిల్ రాజు సూపర్ ప్రైస్ కి కొనేశాడట. ట్రైలర్ కూడా రిలీజవ్వకముందే సినిమాకి బిజినెస్ అయిపోవడంతో భోగవల్లి ప్రసాద్ గారు ఆనందలో ఉన్నారు.
వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న “తొలిప్రేమ” ద్వారా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇకపోతే.. ఈ చిత్రాన్ని నిజానికి దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో భోగవల్లి ప్రసాద్ బ్యానర్ కి ఈ ప్రొజెక్ట్ అప్పగించాడు. ఇప్పుడు సినిమా ఔట్ పుట్ నచ్చి సినిమాని కొనేశాడు దిల్ రాజు. చూస్తుంటే.. “ఫిదా” తర్వాత మరో ఫీల్ గుడ్ మూవీతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు వరుణ్ తేజ్.