చియాన్ విక్రమ్ టైటిల్ పాత్రలో ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వీర ధీర శూర”. మార్చ్ 27 విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు ఆర్థిక సమస్యల కారణంగా ఉదయం ఆటలు క్యాన్సిల్ అయ్యి.. ఎట్టకేలకు సాయంత్రానికి విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద మంచి అంచనాలు నమోదు చేసింది. ముఖ్యంగా.. దర్శకుడు అరుణ్ కుమార్ మునుపటి చిత్రమైన “చిన్నా” మంచి విజయం సాధించి ఉండడం, అతడి ట్రాక్ రికార్డ్ లో ఒక్క బ్యాడ్ ఫిలిం కూడా లేకపోవడంతో “తంగలాన్” తర్వాత విక్రమ్ మరో హిట్టు కొట్టినట్లే అనుకున్నారు జనాలు. మరి “వీర ధీర శూర”తో విక్రమ్ హిట్ కొట్టాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: పెద్దయ్య అలియాస్ రవి (పృథ్వీరాజ్) మరియు అతడి కొడుకు కన్నా (సురాజ్)ను ఎన్కౌంటర్ లో చంపేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాడు లోకల్ ఎస్పీ (ఎస్.జె.సూర్య).
దాంతో వేరే దారి లేక తన కొడుకుని రక్షించాల్సిందిగా కాళి (విక్రమ్) శరణు కోరతాడు పెద్దయ్య.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాణి (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న కాళి ఈ గొడవలో కలగజేసుకున్నాడా? పెద్దయ్య వర్సెస్ ఎస్పీ మధ్యలో కాళి ఎందుకు ఇరుక్కున్నాడు? చివరికి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “వీర ధీర శూర” చిత్రం.
నటీనటుల పనితీరు: నిన్నమొన్నటివరకు ఎస్.జె.సూర్యను బాగా లౌడ్ రోల్స్ లో చూసి మొనాటనీ వచ్చేస్తుంది అనుకున్న తరుణంలో.. కాస్త బ్యాలెన్స్ చేస్తూ మళ్లీ పోలీస్ ఆఫీసర్ గానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మేకపోతు గాంభీర్యం చూపే అతడి వ్యవహారశైలి మంచి సిచ్యుయేషనల్ కామెడీ కూడా పండించింది.
తెలుగులోనే పరమచెత్త పాత్రలు ఇస్తున్నారు పృథ్వీరాజ్ కి ఈమధ్య. అలాంటిది ఓ తమిళ చిత్రంలో మెయిన్ విలన్ రోల్ అది కూడా సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేయడం అనేది మామూలు విషయం కాదు. పెద్దయ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు పృథ్వీ. మొన్నటివరకు కామెడీ రోల్స్ లో చూసిన అతడ్ని ఈ సినిమాలో కాస్త ముసలి విలన్ గా చూడడం కొత్తగా అనిపించింది.
మలయాళ నటుడు సురాజ్ కు మంచి పాత్ర పడింది. మనిషిలో ఉండే సహజమైన బద్ధకం, అవకాశవాదం వంటి కోణాలను అతడు పీక్ లెవల్లో పండించిన విధానం బాగుంది.
దుషారా విజయన్ తనకు అలవాటైపోయిన స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో ఒదిగిపోయింది.
ఇక టైటిల్ పాత్రధారి విక్రమ్ గురించి మాట్లాడుకోవాలి. చాలారోజుల తర్వాత విక్రమ్ ఒక క్యారెక్టర్ లో ఆండర్ ప్లే చేయడం చూసాం. చాలా సెటిల్డ్ గా, స్తబ్దతతో కూడుకున్న కోపాన్ని ప్రదర్శించిన విధానం అదిరింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ & రోడ్డు మీద ఎస్.జె.సూర్యతో కారు బయట నిల్చుని మాట్లాడే సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ లో చాలా సింపుల్ బాడీ లాంగ్వేజ్ తో ఎమోషన్ ను క్యారీ చేసిన విధానం అలరిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. కమర్షియల్ సినిమా టెంప్లేట్ ను మార్చే ప్రయత్నం చేశాడు. సినిమా మొదలైన 25 నిమిషాల వరకు హీరో కనిపించడు, ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది, అసలు యాక్షన్ సినిమాలకి ఈ తరహా యాక్షన్ బ్లాక్ ఎక్కడా చూసి ఉండరు. అలాగే.. హీరో క్యారెక్టరైజేషన్ తాలూకు బ్యాక్ స్టోరీ గురించి ప్రేక్షకుడు ఎక్కువ ఆలోచించేపనిలేకుండా ఇది పార్ట్ 2 అని, కాళి అసలు కథ ప్రీక్వెల్ లో ఉంటుంది అని చెప్పకనే చెప్పి, దర్శకుడిగా తనదైన మార్క్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. అలాగే.. సినిమాను ముగించిన విధానం కూడా ఒకింత నవ్వించి, ఇలా కూడా ఎండ్ చేయొచ్చా అని ఆశ్చర్యపరుస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు అరుణ్ కుమార్ సౌత్ ఆడియన్స్ కి వెస్ట్ సినిమాల్లో కనిపించే స్లో పేస్ యాక్షన్ డ్రామా జోనర్ ను పరిచయం చేసి, అందులోనూ సహజత్వం మిస్ అవ్వకుండా జాగ్రత్తపడి ఒక కంప్లీట్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చాడు.
జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ వర్క్ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా అథెంటిక్ గా ఉన్నాయి.
విశ్లేషణ: “వీర ధీర శూర” కచ్చితంగా మంచి యాక్షన్ సినిమానే. అయితే.. రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కోరుకునే ఫాస్ట్ పేస్ యాక్షన్ సీన్స్ ఉండవు. హీరో కొడతాడు, దెబ్బలు తింటాడు, తెలివిగా ఆట ఆడతాడు, బలంతో భరిస్తాడు. అరుణ్ కుమార్ దర్శకుడిగా యాక్షన్ జోనర్ లో తీసుకొచ్చిన పెనుమార్పుల కోసం, చియాన్ విక్రమ్ సెటిల్డ్ యాక్షన్ కోసం, జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే. అయితే.. కథనం మరీ సాగడం, కొన్ని సన్నివేశాల్లో డ్రామా పేలవంగా ఉండడం వంటి కారణాల వల్ల కొందరికి ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ.. కొత్త తరహా సినిమాలు చూడాలని ఆరాటపడే ఆడియన్స్ ను మాత్రం కచ్చితంగా అలరిస్తుంది.
ఫోకస్ పాయింట్: సౌత్ ఆడియన్స్ కి వెస్ట్ సినిమా ఫార్మాట్ పరిచయం చేసే ప్రయత్నం!
రేటింగ్: 2.5/5