టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సీనియర్ హీరో వెంకటేశ్ కు (Venkatesh) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వెంకటేశ్ ను ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. అయితే వెంకటేశ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వెంకటేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం అయితే లేదు. అయితే ఈ ఎన్నికల్లో వెంకటేశ్ ఇద్దరు అభ్యర్థుల తరపున పొలిటికల్ ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు కోసం వెంకటేశ్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ఆ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్న వెంకీ మామ ఏపీలో కైకలూరు నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కు కూడా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కామినేని శ్రీనివాస్ వెంకటేశ్ ఫ్యామిలీకి సమీప బంధువు కావడం గమనార్హం. అయితే వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఇతర పార్టీలకు వ్యతిరేకంగా కామెంట్లు చేసే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. దిల్ రాజు బ్యానర్ లో ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. వెంకటేశ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.