విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడరు. ఇదివరకు అన్న కొడుకు రానా సినిమా “కృష్ణం వందే జగద్గురు మ్” లో “రాజ రాజా బొబ్బిలి రాజ” పాటలో వెంకటేష్ కనిపించారు. ఇప్పుడు తన మేనల్లుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కోసం ప్రత్యేక పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారు. మలయాళం హిట్ మూవీ ప్రేమమ్ ని అదే పేరుతో తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్నారు.
చందూ మొండెటి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. మరో తార అనుపమ పరమేశ్వరన్ ఒరిజినల్ మూవీలో చేసిన పాత్రనే తెలుగులోనూ చేస్తోంది. యువతను ఆకట్టుకొనేలా ప్రేమమ్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కీలక మైన పాత్రను వెంకటేష్ చేస్తే బాగుంటుందని ఆయన్ను సంప్రదించారు.
అల్లుడుకోసం ఆ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో ఉన్న సన్నివేశాన్ని రీసెంట్ గా చిత్రీకరించారని, చాలా బాగా వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాను ఆగస్టు 12 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.