విక్టరీ వెంకటేష్ అంటే ఒకప్పుడు పద్ధతైన ఫ్యామిలీ హీరో. ఆయన సినిమాలో సెంటిమెంట్ పండితే లేడీస్ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. దశాబ్దాలుగా ‘ఫ్యామిలీ ఆడియన్స్’ అనే ఓటు బ్యాంకును ఆయన కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మారుతున్న ట్రెండ్ ను వెంకీ అందరికంటే ముందుగా పసిగట్టారు. కేవలం ఏడుపులు, పెడబొబ్బలు ఉంటే ఇప్పుడున్న జనరేషన్ థియేటర్లకు రావడం లేదు. అందుకే వెంకీ తన రూట్ మార్చారు.
తాజా లైనప్ ను నిశితంగా గమనిస్తే ఒక క్రేజీ విషయం అర్థమవుతుంది. ఫ్యామిలీ డ్రామాకు ‘క్రైమ్’ అనే మసాలాను దట్టించి కొత్త జానర్ ను సృష్టిస్తున్నారు. కేవలం కుటుంబ కథ అంటే బోర్ కొడుతుంది, అదే క్రైమ్ థ్రిల్లర్ అంటే ఫ్యామిలీస్ రారు. అందుకే ఈ రెండింటిని కలిపేసి ‘ఫ్యామిలీ క్రైమ్’ అనే కొత్త ఫార్ములాను కనిపెట్టారు. ఈ ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతోనే దీనికి బీజం పడింది. పైకి పండుగ సినిమానే అయినా, అందులో గన్నులు, క్రైమ్ కామెడీని మిక్స్ చేసి హిట్ కొట్టారు.
ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. టైటిల్ వింటే ఏదో సీరియల్ పేరులా సాఫ్ట్ గా ఉంది. కానీ లోగోలో మాత్రం ‘ఏకే 47’ అని రాసి, రక్తపు చుక్కలు పెట్టి షాక్ ఇచ్చారు. అంటే ఇది కూడా పైకి కనిపించేంత సాఫ్ట్ ఫ్యామిలీ స్టోరీ కాదన్నమాట. ఒక పద్ధతైన కుటుంబం అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ లా కనిపిస్తోంది.
ఈ జాబితాలో అసలైన కిక్ ఇచ్చే సినిమా ‘దృశ్యం 3’. ఫ్యామిలీ కోసం ఒక సామాన్యుడు చేసే క్రైమ్ ఎంత రక్తి కట్టిస్తుందో మనం ఇప్పటికే రెండు పార్టుల్లో చూశాం. ఇప్పుడు మూడో భాగంతో ఆ థ్రిల్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నారు. ఇలా వరుసగా క్రైమ్ టచ్ ఉన్న ఫ్యామిలీ కథలను ఎంచుకోవడం వెంకీ వేస్తున్న మాస్టర్ ప్లాన్. దీనివల్ల మాస్ ఆడియన్స్ కు కావాల్సిన కిక్ దొరుకుతుంది, ఫ్యామిలీస్ కు కావాల్సిన ఎమోషన్ దొరుకుతుంది.