టాలీవుడ్‌లో వరుస విజయాలతో తన మార్క్‌ను పెంచుకుంటున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) . ఇక అతను తెలుగు హీరోలతో సినిమాలు చేయడంలో వెనుకబడ్డాడా అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘తొలిప్రేమ’ (Tholi Prema) సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకీ, ఆ సినిమా విజయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu) అఖిల్ (Akhil Akkineni) కెరీర్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. అదే తరహాలో నితిన్‌తో (Nithin Kumar) చేసిన ‘రంగ్ దే’ (Rang De) కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
ఈ రెండు సినిమాల ఫలితాల తర్వాత వెంకీ దారిమార్చుకున్నాడు. టాలీవుడ్ హీరోల మీద ఫోకస్ పెట్టకుండా నేరుగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించాడు. ధనుష్‌తో (Dhanush) ‘సార్’ (Sir)అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు. విద్యా వ్యవస్థ గురించి చెప్పిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే మరో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ చేశాడు.
ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు వెంకీ అట్లూరి తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ సూర్యతో (Suriya) ప్లాన్ చేస్తున్నాడు. అంటే వరుసగా తెలుగు హీరోలతో కాకుండా, తమిళ, మలయాళ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఇది వెనక కారణాలు మాత్రం అనేకంగా ఉన్నాయి. ఒకవేళ తెలుగు హీరోలు వెంకీ కథలకు సెట్ కాలేదా లేదా ఆయన కథలు కమర్షియల్ రూట్‌లో లేకపోవడమే కారణమా? అన్నది పరిశీలించాల్సిన విషయం. మరో కోణంలో చూస్తే, వెంకీ సినిమాలు రెండు భాషల్లో డైరెక్ట్ చేసి మంచి బిజినెస్ చేయగలుగుతున్నాడు.
ఒకవేళ తెలుగు హీరోతో సినిమా చేస్తే, ఓటీటీ రేట్లు, థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు మార్కెట్‌కు పరిమితం అవుతుంది. కానీ తమిళ, మలయాళ హీరోలతో సినిమా చేస్తే రెండు భాషల్లోనూ హిట్ అవ్వటంతో పాటు పెద్ద మార్కెట్ దొరుకుతోంది. దీంతో ఆయనకు కమర్షియల్ లెక్కల్లో కూడా ఇది కరెక్ట్ డెసిషన్ అనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి, వెంకీ అట్లూరి టాలీవుడ్ హీరోల్ని పూర్తిగా పక్కన పెట్టేశాడా లేక ఓ సరైన కథ దొరికితే మళ్లీ తెలుగు హీరోతో సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.