తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి, ఇతర భాషల అమ్మాయిల కంటే మన వాళ్లు ఏమీ తక్కువ కాదు, అవకాశం ఇస్తే నిరూపించుకుంటారు అని అంటుంటారు మన ఇండస్ట్రీలో. యువ నిర్మాత ఎస్‌కేఎన్ కూడా ఇలానే మాట్లాడేవారు. చాలా సినిమాల ఈవెంట్లలో, ఆయన సినిమల సమయంలో కూడా ఇదే మాట చెప్పేవారు. ఇలానే చేశారు కూడా. అయితే ఇప్పుడు ఆయన ‘మేం తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వం. ఇస్తే సమస్యలు వస్తున్నాయి’ అని కామెంట్ చేశారు.
‘లవ్ టుడే’ (Love Today) సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు సొంతం చేసుకున్న తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎస్‌కేఎన్ ఓ అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో హీరోయిన్లగా తెలుగు అమ్మాయిలు అనే టాపిక్ చర్చకు వచ్చింది. ఇతర భాషల అమ్మాయిల కంటే తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు.
అందుకే తాను, దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) తెలుగు రాని హీరోయిన్లని సినిమాల్లోకి ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఎస్‌కేఎన్ ఎక్కడా వైష్ణవి చైతన్య పేరు ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఎస్‌కేఎన్ (SKN) – సాయి రాజేశ్ కలసి చేసిన సినిమా ‘బేబీ’ (Baby). అందులో తెలుగు వచ్చిన వైష్ణవి చైతన్యను (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. సినిమా ప్రచారంలో అంతా బాగానే కనిపించారు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది వాళ్లే చెప్పాలి.
నిజానికి ఆ సినిమా వల్ల వైష్ణవి చైతన్యనే ఎక్కువ ఇబ్బందిపడింది. ఆ పాత్ర తీరును తనకు ఆపాదిస్తూ నెగిటివ్ కామెంట్లు చేశారు. పాత్రను పాత్రలా చూడండి అంటూ ఆమె రిక్వెస్ట్‌లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పాత్రలు తెలుగు అమ్మాయిలు చేస్తే ఇబ్బంది కాబట్టి ఎస్‌కేఎన్ అలా అన్నారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ఆ పాత్ర వల్ల ఆయనకు అయితే ఎలాంటి ఇబ్బంది రాలేదు. తిరిగి కాస్త ఎక్కువ లాభాలే వచ్చాయి.