‘ఛలో’, ‘భీష్మ’ అంటూ రెండు ఫన్‌ఫుల్ ఎంటర్‌లైనర్లు తీసి.. తన అభిమాన హీరో చిరంజీవిని మెప్పించి ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసుకున్నాడు వెంకీ కుడుముల. అయితే కథ విషయంలో చిరంజీవిని ఒప్పించలేక వెనుకబడ్డారు. దీంతో చిరంజీవి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి వేరే కథలవైపు, దర్శకులవైపు వెళ్లిపోయారు. అవును.. అదంతా అయిపోయింది కదా ఇప్పుడెందుకు చర్చ అని అనుకుంటున్నారా? ఎందుకంటే అప్పుడు ఆగిపోయింది, ఆ తర్వాత ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు అనుకున్న ప్రాజెక్ట్ మళ్లీ డిస్కషన్స్‌లోకి వచ్చిందట.
అవును, మీరు చదివింది నిజమే. స్టార్ హీరో – ఫ్యాన్ బాయ్ కాంబినేషన్ మళ్లీ డిస్కషన్స్‌లోకి వచ్చింది. నితిన్ – శ్రీలీల ‘రాబిన్ హుడ్’ సినిమా ఫలితం తర్వత కామ్ అయిపోయిన వెంకీ చిరంజీవి కోసం ఓ కథ రాశారట. పక్కా కామెడీ సినిమా అని, చిరంజీవి వయసు, ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఓ ముదురు జంట ప్రేమలో పడి.. తమ పిల్లలకు తెలియకుండా తమ ప్రేమను ఎలా కొనసాగించారు ? అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారట.
ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క/త్రిషను చూపించాలి అని కూడా ఫిక్స్ అయిపోయారట. అలాగే ఇందులో ఓ ప్రామిసింగ్ యంగ్ హీరో, హీరోయిన్‌ను నటింపజేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అప్పట్లో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన మెగాస్టార్ అభిమాన ప్రొడ్యూస్ డీవీవీ దానయ్యనే ఇప్పుడు కూడా నిర్మాతగా ఉంటారు అని చెబుతున్నారు. అయితే ఆయనతోపాటు మరొకరు కూడా నిర్మాణంలో భాగస్వామి అవుతారనే మాటలూ వినిపిస్తున్నాయి.
రెగ్యులర్ కామెడీ, యాక్షన్ సినిమాలను చిరంజీవికి తగ్గట్టుగా మార్చి తీస్తే విజయం సాధించడం సులభం అని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చేసి చూపించారు దర్శకుడు బాబి. ఇప్పుడు అదే దారిలో వెంకీ కుడుముల నడిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం, విజయం సాధించడం పక్కా అని చెప్పొచ్చు. చూడాలి మరి గతంలో ఇబ్బందిపడతారా? లేక చిరు అభిమానులను సంతోషపెడతారా అనేది వెంకీ చేతుల్లోనే ఉంది.