“జై భీమ్” చిత్రంతో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “వేట్టయన్” (Vettaiyan) . రజనీకాంత్ (Rajinikanth) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana) కీలకపాత్రలు పోషించారు. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ తమిళ టైటిల్ తో విడుదలవ్వడం చిన్నపాటి హడావుడి సృష్టించింది. అయితే.. “వేటగాడు” అనే టైటిల్ దొరక్కపోవడం వల్లే తమిళ టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు చిత్రబృందం. మరి ఈ తమిళ డబ్బింగ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: పోలీస్ డిపార్టుమెంట్లో “హంటర్”గా పిలవబడే అతియన్ (రజనీకాంత్)కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పబ్లిక్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. శరణ్య (దుషారా విజయన్) (Dushara Vijayan) హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసే క్రమంలో.. ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయని గ్రహిస్తాడు అతియన్. అతియన్ మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరి పేర్లు బయటకి వచ్చాయి? అసలు శరణ్యను ఎందుకు చంపాలనుకున్నారు? ఆమె హత్య వెనుక ఉన్నది ఎవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “వేట్టయన్” (Vettaiyan) చిత్రం.
నటీనటుల పనితీరు: రజనీకాంత్ ఈ సినిమాలోని అతియన్ పాత్రలో ఎప్పట్లానే తనదైన స్టైల్ & స్క్రీన్ ప్రెజన్స్ తో అదరగొట్టాడు. అయితే.. యాక్షన్ సీన్స్ లో మాత్రం ఆయన వయోభారం చాలా క్లారిటీగా కనిపిస్తోంది. చిన్నపాటి మూమెంట్స్ విషయంలోనూ ఇబ్బందిపడుతున్నారు. ఇకపై ఆయనపై ఈ తరహా భారీ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసేప్పుడు జాగ్రత్తపడితే బెటర్. నిజానికి ఫహాద్ పోషించాల్సినంత పెద్ద పాత్రమీ కాదు ఈ సినిమాలో ప్యాట్రిక్ క్యారెక్టర్. కేవలం రజనీకాంత్ మీద గౌరవంతో నటించి ఉంటాడు.
అతడి పాత్రతో కథనాన్ని వేగవంతం చేసిన విధానం బాగుంది. ఓ బాధ్యతాయుతమైన పాత్రలో అమితాబ్ కనిపించారు. మానవ హక్కులను కాపాడే అధికారిగా ఆయన నటన సినిమాకి మంచి వేల్యు యాడ్ చేసింది. మంజు వారియర్ (Manju Warrier) , రితికా సింగ్ (Ritika Singh) లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కార్పొరేట్ క్రిమినల్ గా రానా దగ్గుబాటి నటరాజ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా హీరోను బట్టి తమ ఫార్మాట్ ను మార్చుకుని, హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకులు. కానీ.. జ్ఞానవేల్ మాత్రం సూపర్ స్టార్ ఇమేజ్ ను తనదైన బాధ్యతాయుతమైన కథతో ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. సినిమా అనే ఓ అద్భుతమైన మాధ్యమాన్ని వినియోగించుకుని ప్రస్తుతం సమాజంలో ప్రజలు కోపంతో కోరుకునేది న్యాయం కాదని, న్యాయంగా పడేదే శిక్ష అని వివరించిన విధానం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. అలాగే.. రజనీకాంత్ అభిమానులను కూడా ఎక్కడా నిరాశపరచకుండా, కథలో కావాలని ఇరికించకుండా రాసుకున్న యాక్షన్ బ్లాక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా పోలీస్ ప్రొసీజర్స్ & న్యాయ వ్యవస్థ సమాజం పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనే విషయాలను చూపించిన విధానం బాగుంది. అలాగే.. డబ్బున్న కార్పొరేట్ క్రిమినల్స్ చట్టాన్ని, న్యాయాన్ని తమకు వీలుగా ఎలా మార్చుకుంటున్నారు, ప్రజల బలహీనతలను వాడుకొని వాళ్ళ ఎలా దోచుకుంటున్నారు అనేది చూపించిన విధానం రాష్ట్రంలో మొన్నామధ్య జరిగిన “బైజూస్ యాప్” ఉదంతాన్ని గుర్తుచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్స్టంట్ జస్టిస్ అనేది ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
ఒక దర్శకుడిగా, కథకుడిగా తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్నాడు జ్ఞానవేల్. అనిరుధ్ (Anirudh Ravichander) ఎప్పట్లానే తనదైన పనితనంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కథిర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గానే నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే.. కొన్ని పాత్రలతో మాట్లాడించిన తెలంగాణ యాస చాలా అసహజంగా ఉంది.
విశ్లేషణ: పోలీస్ ఎన్ కౌంటర్ లకు చిన్నప్పటి మద్దతు ఇస్తూనే.. ఆ ఎన్ కౌంటర్ల పేరు మీద జరిగే బడా మోసాలను ఎండగట్టిన సినిమా “వేట్టయన్”. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లు ఈ తరహా ప్రాజెక్ట్ లో కనిపించడం వల్ల దర్శకుడు జ్ఞానవేల్ చెప్పాలనుకున్న అంశానికి మంచి వేల్యు ఏర్పడింది. స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు ఈ తరహా సినిమాలు చేయడం అనేది ప్రశంసార్హమైన విషయం. మాస్ ఎలివేషన్స్ తోపాటు సమాజంలోని మంచిని, చెడుని ప్రేక్షకులకు గుర్తుచేయడం బాధ్యతగా భావించడం ముఖ్యం. ఈ పద్ధతిని మరింతమంది సూపర్ స్టార్లు అప్పుడప్పుడు ఫాలో అయితే చాలా బాగుంటుంది.
ఫోకస్ పాయింట్: రజనీ మార్క్ మిస్ అవ్వని బాధ్యతగల సినిమా!
రేటింగ్: 3/5