అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఖాకీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ చిత్రంలో అమితాబ్ పాత్రని పోషిస్తున్నాడు. ఇక బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ విషయం పై స్పందించింది విద్యాబాలన్. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా విద్యా బాలన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ మాట్లాడుతూ… “నిజానికి రీమేక్‌లలో నటించడం నాకు ఇష్టం ఉండదు… అయినా చేస్తున్నాను. ‘పింక్’ రీమేక్‌లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా చిన్న పాత్ర. బోనీ జీ (కపూర్) ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు. ఆయనే నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. ‘ఇందులో అతిథి పాత్ర ఉంది, చేస్తావా?’ అని అన్నారు. నేను చేస్తానని చెప్పా. రీమేక్‌లలో నటించాలని ఎప్పుడూ నేననుకోలేదు… కేవలం బోనీ జీ కోసం దీన్ని చేస్తున్నా. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది” అంటూ విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ రీమేక్‌లో ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్, నజ్రియా నజీమ్ ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నుండీ.. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు కోలీవుడ్ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.