బుజ్జమ్మ ఈసారి కామెడీ చేయదంట!

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన తమిళ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్. ఈమధ్యకాలంలో తమిళంలోకంటే తెలుగులోనే ఎక్కువ సినిమా చేస్తున్న ఈ అమ్మడు “రన్ రాజా రన్” సినిమాలో బుజ్జమ్మగా పండించిన కామెడీ సినిమాకి హైలైట్ అవ్వడమే కాక ఆమెకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఇప్పటివరకూ విద్యుల్లేఖ అంటే కమెడియన్ అనే అందరూ గుర్తుపడతారు. కానీ.. తనలో కామెడీ మాత్రమే కాక మరో యాంగిల్ కూడా ఉందని చెబుతోంది. ఇటీవల కాస్త గ్లామర్ డోస్ పెంచి లావుగా ఉంటే ఎక్స్ పోజింగ్ కి పనికిరారా అంటూ హాట్ హాట్ ఫోటోషూట్ చేయించుకొని ట్విట్టర్ ద్వారా మీడియాకి వదిలింది.

ఇప్పుడు తాజాగా తనలో కామెడీ, గ్లామర్ తోపాటు సీరియస్ యాంగిల్ కూడా ఉందని చెప్పాలనుకొంటోంది. అందుకే.. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ సుశాంత్ హీరోగా తెరకెక్కిస్తున్న “చిలసౌ”లో విద్యుల్లేఖ సీరియస్ క్యారెక్టర్ లో కనిపించనుందట. ఈ విషయాన్ని విద్యుల్లేఖ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెల్లడించింది. రాహుల్ రవీంద్రన్ ఒక్కడే తనలోని సీరియస్ యాంగిల్ ను గుర్తించాడని, అందుకు రాహుల్ కి స్పెషల్ థ్యాంక్స్ అని విద్యుల్లేఖ తెలిపింది. ఇకపోతే.. కన్ఫ్యూజన్ డ్రామాగా తెరకెక్కుతున్న “చిలసౌ” మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా హీరోగా సుశాంత్ కి, డైరెక్టర్ గా రాహుల్ రవీంద్రన్ కి చాలామంచి పేరు తీసుకురావడమే కాక సూపర్ హిట్ అవుతుందని టాక్. చూడాలి మరి సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది ఏ విషయం ఏమిటనేది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus