మెట్లు ఎక్కి పెకి వెళ్తున్నప్పుడు… కొంతసేపటికి మనం ఎక్కిన మెట్లు మరచిపోకూడదు అంటారు. అలా మరచిపోయినవాళ్లు ఇబ్బందిపడతారు అని కూడా మన పెద్దలు చెబుతుంటారు. ఈ విషయాన్ని సినిమా హీరోలకు ఆపాదిస్తే… ఏ దర్శకులుతో సినిమాలు చేసి ఎదిగామో స్టార్ స్టేటస్ వచ్చాక మరచిపోకూడదు అని అనొచ్చు. అలా మరచిపోయినవాళ్లు తర్వాత ఏమవుతారో కానీ… ఇప్పుడు అయితే ట్రోలింగ్‌కి గురవుతారు అని చెప్పొచ్చు. దీనికి ప్రస్తుతం నిలువెత్తు ఉదాహరణ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ). కారణం ఆయన దర్శకుల గురించి చేసి వ్యాఖ్యలే.
‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొత్త దర్శకులతో పని చేయనంటూ అని చెప్పిన విజయ్ … దానికి చెప్పిన కారణం నవ్వులపాలు అయ్యేలా ఉంది అని నెటిజన్లు అంటున్నారు. విజయ్ కెరీర్‌లో వచ్చిన విజయాలు చాలావరకు కొత్త దర్శకుల వల్లనే అని.. అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని అనడం… వారికి బడ్జెట్, ఇతర విషయాలు హ్యాండిల్ చేయడం రాదని అనడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక… విజయ్ ఈ మాట అనడం విడ్డూరంగా అనిపిస్తోంది అనేది నెటిజన్లు వాదన. విజయ్ కెరీర్‌లో మంచి విజయాలు అందుకున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ (Yevade Subramanyam), ‘పెళ్లి చూపులు’(Pelli Choopulu) , ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) , ‘ట్యాక్సీవాలా’ కొత్త దర్శకుల వల్ల వచ్చినవే. ఇక డిస్టార్లుగా, పెద్దగా ఉపయోగపడని సినిమాలుగా మారిన ‘లైగర్’ (Liger), ‘వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)’ లాంటివి సీనియర్ దర్శకులతో వచ్చినవే అంటూ ఫిల్మోగ్రఫీ వల్లెవేస్తున్నారు నెటిజన్లు.
కాస్త ఫర్వాలేదనిపించిన ‘ఖుషి’ (kushi) తీసింది కూడా కొత్త దర్శకుడు కాదు. దీంతో విజయ్ చెప్పిన లాజిక్ నాసిరకంగా ఉంది అంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి కామెంట్లతో సినిమాల ముందు రచ్చ చేయడం విజయ్‌కి అలవాటే. మరి ఈ ఆలోచన వెనుక ఏం మారోలచన ఉందో ఆయనకే తెలియాలి.