విజయ్ దేవరకొండ.. సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఒకలా, సినిమా రిలీజ్ లేనప్పుడు ఒకలా మాట్లాడతాడా? ఏమో ఆయన మాటల తీరు చూస్తుంటే ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ మాట తీరు చూసిన ఎవరైనా ఇదే మాట అంటారు. సినిమాల విడుదల ఉన్నప్పుడు తానొక బాధితుడు అనేలా వస్తాయి మాటలు. అదే సినిమా రిలీజ్ దగ్గర్లో లేకపోతే తాను పర్‌ఫెక్ట్ కాదని, తప్పులు చేస్తుంటాను అని అంటుంటారు. ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్‌కి వచ్చి రెండోలా మాట్లాడాడు.
‘నేను రివర్స్ మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి ఎదుగుతున్నావ్’ అంటూ రష్మిక మందనను ఉద్దేశించి మాట్లాడాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించి మెప్పించిన సినిమా ఇది. ఇటీవల విడుదలై మంచి ఫలితం రావడంతో సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. విజయ్ – రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది అనే వార్తలు వచ్చిన తర్వాత ఇద్దరూ కలసి పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చిన తొలి కార్యక్రమం ఇదే. ఈ వేదిక మీద విజయ్ మాట్లాడుతూ రష్మికను తెగ పొగిడేశాడు.
తనతో సహా జీవితంలో అందరూ తప్పులు చేస్తుంటారని, ఎవరూ పర్‌ఫెక్ట్ కాదని విజయ్ అన్నాడు. మన పార్ట్‌నర్‌కి రక్షణ ఉండాలని అందరికీ ఒక భావన ఉంటుంది. అయితే అది వాళ్లను నియంత్రించేలా ఉండకూడదు. వాళ్ల కలలకు, సంతోషాలకు రక్షగా నిలబడాలి. ఇద్దరి జీవితంలో ఎన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నదే ఇక్కడ ముఖ్యం. జీవితం సింపుల్‌గా, సరదాగా ఉండాలి అని రిలేషన్‌షిప్ గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు విజయ్.
రష్మికను ‘గీత గోవిందం’ సినిమా టైమ్ నుండి చూస్తున్నానని, ఆమె ఒక భూదేవి అని పొగిడేశాడు. ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుందని చెప్పాడు. ఆమె జర్నీ చూస్తుంటే, గర్వంగా ఉందని కూడా అన్నాడు. తనను ఎవరైనా ఏమైనా అంటే రివర్స్‌లో వాళ్ల మీదకు వెళ్తానని.. కానీ రషి (రష్మిక ముద్దు పేరు.. ఈ ఈవెంట్‌లోనే తెలిసింది) ఎవరెన్ని మాటలు అన్నా, పట్టించుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తూనే ఉందని మెచ్చుకున్నాడు.