Vijay: పవన్ రూట్లోనే విజయ్ పొలిటికల్ గేమ్.. అదొక్కటే దారి?

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి, ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. కొత్తగా ప్రారంభించిన త‌మిళగిల్ కాజీగం (టీవీకే) పార్టీకి ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే విజయ్ పార్టీకి ముందున్న మార్గం ఏదీ సులభం కాదు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలడా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Vijay

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) విజయ్‌కు ఓ ఆసక్తికరమైన వ్యూహాన్ని సూచించినట్లు సమాచారం. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే లాంటి రెండు బలమైన పార్టీలే రాజకీయంగా ఆధిపత్యం చూపిస్తున్నాయి. అన్నాడీఎంకేకు 25% ఓటు బ్యాంక్ ఉంటే, టీవీకే గరిష్ఠంగా 20% ఓట్లు తెచ్చుకోగలదని లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విజయ్‌కు కష్టసాధ్యమని పీకే విశ్లేషించారని తెలుస్తోంది.

దీంతో విజయ్ తన పార్టీ బలపడేంత వరకు ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నా, చివరికి పొత్తులే ఏకైక మార్గంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాదిరిగా, ఎన్నికల సమీపంలోనే విజయ్ పొత్తుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, అన్నాడీఎంకేతో పొత్తుకు వెళ్లి, తనకు డిప్యూటీ సీఎం స్థానం కేటాయించుకునే అవకాశాన్ని పీకే ముందుకు తీసుకొచ్చారని సమాచారం.

అయితే విజయ్ మాత్రం తన సోలోగా సీఎం కుర్చీ కోసం పోరాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, పొత్తు లేకుండా ఒంటరిగా పెద్ద విజయాన్ని సాధించడం సాధ్యమేనా? అనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు, తన అభిమాన బేస్‌ను క్యాష్ చేసుకోవాలనుకునే విజయ్, పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఫ్యాన్ బేస్ దూరమవుతుందనే భయం కూడా కలిగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికి విజయ్ ఏ నిర్ణయాన్నీ ఖరారు చేయలేదు. కానీ రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే, ఎప్పటికైనా పొత్తు పెట్టుకోవాల్సిందే అనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి విజయ్ నిజంగానే పవన్ కళ్యాణ్ తరహాలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తాడా? లేక సోలో మార్గాన్ని ఎంచుకుంటాడా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus