గతకొద్ది రోజులుగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు చేస్తున్న పూజలు, ప్రార్థనలు ఫలించాయి. భవిష్యత్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహన కృష్ణ తనయుడు నందమూరి తారక రత్న క్రమంగా కోలుకుంటున్నారు. అవయవాల పనితీరు మెరుగు పడిందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారక రత్నను వైసీపీ నేత విజయ సాయి రెడ్డి పరామర్శించారు.
ఏపీలో అధికార పార్టీకి చెందిన ఆయన తారకరత్నను పరామర్శించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సాయి రెడ్డి, తారకరత్న మధ్య బంధుత్వం ఉందనే విషయం బయటకు పెద్దగా తెలియదు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి, విజయసాయి రెడ్డికి ఉన్న బంధం విషయానికొస్తే.. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురే అలేఖ్య. విజయసాయి రెడ్డికి కూతురు వరుస. అలాగే తారకరత్న ఆయనకు అల్లుడు వరుస అవుతారు. 2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో తారక్, అలేఖ్యను పెళ్లి చేసుకున్నారు.
వీరిది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వీరు తర్వాత ప్రేమికులుగా మారి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ పాప ఉంది. తారకరత్నకిది మొదటి వివాహం కాగా.. అలేఖ్యకు రెండో పెళ్లి.. అంతకుముందు ఆమె టీడీపీలో ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత ఎలిమినేటి మాధవ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నారు. కొద్దికాలం తర్వాత విబేధాలు రావడంతో విడిపోయారు. తారక్ హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రానికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఈ వివాహం కారణంగానే తారకరత్న కుటుంబంలో విబేధాలు తలెత్తాయని అంటుంటారు.
ఇక తారకరత్నను పరామర్శించిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుక్షణం వెన్నంటి ఉండి తారకరత్న కోలుకోవడానికి సహాయ సహకారాలు అందించిన నందమూరి బాలకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. ‘‘ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడుకి రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడు పైభాగం కొంత దెబ్బతింది.. వాపు తగ్గాక కోలుకుంటారని వైద్యులు చెప్పారు.. గుండె చక్కగా పనిచేస్తుంది.. రక్తప్రసరణ బాగుంది.. బాలకృష్ణ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు.. ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు..