ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మూకీ సినిమాలు చాలా తక్కువ. టాకీలు మొదలుకాక ముందు మూకీ సినిమాలు తీశారు కానీ ఆ తరువాత వాటికి ప్రాధాన్యత తగ్గింది. మధ్యలో కొన్ని తీసినా వర్కవుట్ కాలేదు. కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ మాత్రం సక్సెస్ అందుకుంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ‘పుష్పక విమానం’ను బీట్ చేసే మూకీ సినిమా రాలేదు. స్టార్ హీరోలు ఎవరూ కూడా మూకీ సినిమాలపై ఆసక్తి చూపలేదు.
అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాను ముందుగా మూకీగా తీయాలనుకున్నారట. కానీ ఆ తరువాత టాకీలోనే తీశారు. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో మూకీ సినిమాకి రెడీ అవ్వడం విశేషం. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ‘గాంధీ టాక్స్’ అనే మూకీ సినిమా తెరకెక్కుతోంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
బ్యాక్ గ్రౌండ్ మొత్తం డబ్బుతో నింపేశారు. దీన్ని బట్టి ఈ సినిమా కరెన్సీపై ఆధారపడి నడిచే కథగా తెలుస్తోంది. మూకీ సినిమా కాబట్టి ఒక భాషకి మాత్రం పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను ఆరు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, మరాఠీలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ‘పుష్పక విమానం’లానే ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి!