విశ్వరూపం 2

2013లో విడుదలైన “విశ్వరూపం” చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “విశ్వరూపం 2”. కమల్ హాసన్ నటించి, నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే కావడం గమనార్హం. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగమైతే అయిదేళ్ళ క్రితం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న విషయం నిజమే కానీ.. అదే అయిదేళ్ళ క్రితమే షూటింగ్ జరుపుకొని ఇన్నాళ్ల తర్వాత విడుదలైన ఈ సీక్వెల్ ఇప్పుడు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : “విశ్వరూపం” ఎక్కడైతే ఎండ్ అయ్యిందో.. సెకండ్ పార్ట్ అక్కడ్నుంచే మొదలైంది. విశ్వనాధన్ అలియాస్ మేజర్ వసీం అహ్మద్ కాష్మీరీ (కమల్ హాసన్) టెర్రరిస్టులు ప్లాన్ చేసిన వరుస బాంబ్ బ్లాస్ట్స్ నుంచి అమెరికాను రక్షించి అనంతరం ఇండియా వస్తాడు. అంతకుముందు వరకూ తన భర్త నపుంసకుడు అనుకొన్న భార్య నిరుపమ (పూజా కుమార్) ఇప్పుడు అతడ్ని అర్ధం చేసుకొని అతడితోనే ప్రయాణం మొదలెడుతుంది. వీళ్ళకి తోడుగా కల్నల్ జగన్నాధ్ (శేఖర్ కపూర్), అస్మిత్ సుబ్రమణ్యం (ఆండ్రియా) వస్తారు.

అమెరికాలో కంటే పెద్ద విధ్వంసాన్ని ఇండియాలో ప్లాన్ చేస్తాడు ఒమర్ ఖురేషీ (రాహుల్ బోస్). దాన్ని అమలు చేయడం కోసం ఇండియాలోని ఇంటిలిజెన్స్ ఏజెంట్స్ కొంతమందిని లోబరుచుకొంటాడు. బయట ప్రపంచంలో మాత్రమే కాకుండా తన సంస్థలోను శత్రువులు ఉండడంతో.. వాళ్లందర్నీ ఎదుర్కొని ఒమర్ ప్లాన్ చేసిన సీరియల్ బ్లాస్ట్స్ ను విశ్వనాధ్ అలియాస్ వసీం అహ్మద్ ఎలా అరికట్టాడు? అనేది “విశ్వరూపం 2” కథాంశం.

నటీనటుల పనితీరు : ఒక నటుడిగా కమల్ హాసన్ ను విమర్శించే, విశ్లేషించే, కొనియాడే స్థాయి నాకు లేదు. నటుడిగా ఆయన కనబడిన ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రేక్షకులు కల్లప్పగించి ఆయన నట విశ్వరూపాన్ని చూస్తూ ఉండిపోతారు. ముఖ్యంగా తన తల్లి అల్జైమర్స్ కారణంగా తనను గుర్తించకపోయినా తనను తాను వేరొకరిగా తల్లికి పరిచయం చేసుకొని, ఆమెతో తన అనుబంధాన్ని నెమరవేసుకొనే సన్నివేశంలో, బుల్లెట్ గాయానికి దెబ్బతిన్న సీక్వెన్స్ లో కమల్ నటన, హావభావాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి, భయాన్ని కలిగిస్తాయి. అయితే.. ఈ చిత్రంలో శృంగారంపాళ్ళు ఆయన మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే తక్కువగానే ఉన్నా.. ఉన్న ఆ ఒక్క సీక్వెన్స్ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది.

పూజా కుమార్ కన్ఫ్యూజ్డ్ & ఇంటిలిజెంట్ వైఫ్ గా పర్వాలేదనిపించుకొంది, ఏజెంట్ గా ఆండ్రియాకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించగా.. దాన్ని ఆమె పూర్తిస్థాయిలో వినియోగించుకొంది. ఇక బాలీవుడ్ ప్రముఖ నటులు-దర్శకులు శేఖర్ కపూర్ ఈ చిత్రంలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నారు. రాహుల్ బోస్ మునుపటి భాగంలో వలె విలనిజంతో అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు : ఈ చిత్రానికి కథ, దర్శకత్వం నిర్మాణం వంటి ముఖ్యమైన బాధ్యతలు తీసుకొన్న కమల్ హాసన్ మొదటి భాగంలో మూడు విషయాల్లోనూ సక్సెస్ అయ్యాడు. అయితే.. రెండో భాగానికి వచ్చేసరికి మాత్రం అయిదేళ్ళ క్రితం తీసిన సినిమా కావడం వల్లనో లేక స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వలనో తెలియదు కానీ.. దర్శకుడిగా పర్లేదు కానీ నిర్మాతగా, కథకుడిగా మాత్రం విఫలమయ్యాడు. నిజానికి “విశ్వరూపం” లాంటి స్పై థ్రిల్లర్లకు కావాల్సింది ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే మరియు సంభ్రమాశ్చర్యానికి గురి చేసే యాక్షన్ సీక్వెన్స్ లు. పార్ట్ 1లో ఇవన్నీ పుష్కలంగా ఉండగా.. రెండో భాగంలో ఇవన్నీ లోపించాయి. ముఖ్యంగా.. సీజీ వర్క్, గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసిన ప్రీఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ & అండర్ వాటర్ సీక్వెన్స్ చాలా లోక్వాలిటీగా ఉంటుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

జీబ్రాన్ స్వరపరిచిన బాణీలు బాగున్నాయి. “ఆధారమా.. అనురాగమా” పాట కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. ఆ పాటను కమల్ హాసన్ పాడడం విశేషం. ఇక నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణంగా నిలిచింది. సినిమాలో కనపడని ఇంటెన్సిటీని వినబడేలా చేశాడు జీబ్రాన్.

సను వర్ఘీసీ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. “బుల్లెట్ టైమ్ షాట్స్” కాస్త ఎక్కువైనట్లు అనిపించినా.. చూడ్డానికి మాత్రం బాగున్నాయి. అలాగే.. కెమెరా మూమెంట్స్ రెగ్యులర్ సినిమాటిక్ ఫార్మాట్ లో కాకుండా ఇంకాస్త ఎలివేటెడ్ గా ఉండడం సినిమాలో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలో ఒకటి. టెక్నికల్ గా సినిమా బాగున్నప్పటికీ.. ఆ టెక్నాలజీని మించిన టెక్నాలజీతో ఈమధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చి ఉండడంతో.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ముఖ్యంగా.. మొదటి భాగంలో ఉన్న మ్యాజిక్, మూమెంట్స్, లైఫ్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. మొదటి భాగంలో ఒక సన్నివేశంలో రేపు ఆత్మహుతి దాడికి సిద్ధంగా ఉన్న ఓ టెర్రరిస్ట్ తనను ఉయ్యాల ఊపమని అడిగే సన్నివేశంతో “అందరు టెర్రరిస్టులు క్రూరులు కాదు, కొందరు బలవంతంగా ఆ కూపంలోకి లాగబడుతున్నారు” అనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో ఆ తరహాలో ఒక్క సన్నివేశం కూడా రాసుకోకపోవడం గమనార్హం.

విశ్లేషణ : కమల్ హాసన్ కచ్చితంగా అద్భుతమైన నటుడు, దర్శకుడు. ఎవ్వరూ కాదనలేని నిజమది. హాలీవుడ్ ను సైతం తనదైన శైలి ఆలోచనా ధోరణితో ఇన్స్పైర్ చేసిన ఘనత ఆయనది. అలాంటి కమల్ హాసన్ సినిమా అనగానే ట్రైలర్, సాంగ్స్ గురించి ఇసుమంతైనా పట్టించుకోకుండా థియేటర్లకి వెళ్లిపోతుంటాం. కానీ.. “విశ్వరూపం” స్థాయిలో “విశ్వరూపం 2” లేకపోవడంతో ఈసారి కమల్ అభిమానులు కాస్త నిరాశచెందడం తప్పదు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus