బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడేం బాలేదు. ఏ సినిమా తీసినా విజయం పక్కా, వసూళ్లు అదిరిపోతాయ్ అని అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎంతో కష్టపడితే కానీ.. విజయం దక్కడం లేదు. అది కూడా బాగా తక్కువే. అగ్ర హీరోల సినిమాలకైతే విజయం నల్లేరు మీద నడక నుండి.. ముళ్ల మీద నడకలా మారిపోయింది. అయితే ఈ పరిస్థితి ఒకప్పుడు చిన్న సినిమాలకు ఉండేది. చిన్న హీరోలు, దర్శకనిర్మాతలు చేసే సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. తాజాగా బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. దీంతో చిన్న సినిమాల సంగతిని కూడా బయటకు తీశారు.
చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడం, దొరికినా ఒకట్రెండు రోజులకే సినిమాలు తీసేయడం లాంటివి జరిగేవి. ఏంటీ… టాలీవుడ్‌లోనే అనుకున్నాం.. బాలీవుడ్‌లో కూడా ఈ సమస్య ఉందా అంటారా. కచ్చితంగా ఉంది. ఈ అంశాన్నే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తావించాడు. అది కూడా ఏదో ఓ మాట అనేలా కాదు. ఏకంగా స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కి స్పందనగా ఈ మాటలు అన్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ బారిన పడి విలవిల్లాడుతున్న ‘లాల్ సింగ్ చడ్డా’ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఇంత మంచి సినిమాను ఎందుకు బహిష్కరిస్తున్నారో తెలియడం లేదు.
250 మంది సిబ్బంది రెండున్నరేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపైనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్ పెద్దల్ని డాన్‌లుగా అభివర్ణించి మాట్లాడారు. ‘‘చిన్న సినిమాలను, కంటెంట్ ఉన్న సినిమాలను బాలీవుడ్ డాన్‌లుగా ఆపినప్పుడు, ఆ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నపుడు మీరెందుకు స్పందించలేదు. ఎందరో ప్రతిభావంతులైన నటులు, రచయితల జీవితాల నాశనమయ్యాయి కదా.
ఆ సినిమాలకు పనిచేసింది ఆ 250 మంది పేద ప్రజలే కదా’’ అని ట్వీట్ చేశారు వివేక్. ‘‘బాలీవుడ్ డాన్‌ల దురహంకారం, ఫాసిజం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీలో ముంచేస్తారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్. వివేక్ అగ్నిహోత్రి ఈ ఏడాది మార్చిలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ విజయంతో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్’ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1984 నాటి సిక్కుల అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.