సినిమాకు కాస్టింగ్ చాలా ముఖ్యం. అన్నింటికి మించి ఆ కాస్టింగ్ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఓ పాత్రకు తగ్గ నటుడిని తీసుకోవాలి. అతను ఆ పాత్రకు ఎక్కువైపోయినా, ఆ పాత్ర అతనికి తక్కువైపోయినా.. మొత్తంగా ఆ నటుడు ఆ సినిమా ఎక్కువతక్కువైనా సినిమా ఫలితం తక్కువైపోతుంది. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నటుల్ని తీసుకొచ్చి మన సినిమాలో పెట్టుకుంటే సినిమాకు అన్నిసార్లు కలసి రాదు. దీనికి రీసెంట్ టైమ్స్‌లో పెద్ద ఉదాహరణలు అంటే మైక్ టైసన్ అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫలితం తెలిసిన హీరో మరోసారి హాలీవుడ్ ప్రముఖ నటుడిని తీసుకొస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఈ మైక్ టైసన్ కథేంటో తెలిసే ఉంటుంది. ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్‌ను నటింపజేశారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ సినిమాకు ఆయన పాత్ర అంత అవసరం లేదు. ఓవర్ కాస్టింగ్ అని తొలుత నుండి విమర్శలు వచ్చాయి. ఇక సినిమా వచ్చాక ఆ మాటలే నిజమని తేలాయి. సినిమాకు ఆయన ఉపయోగకపడకపోగా.. తిరిగి భారంగా మారాడు అని విమర్శకులు తమ రివ్యూల్లో రాసుకొచ్చారు. ఇదంతా చూసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరో హాలీవుడ్ సెలబ్రిటీని తీసుకొస్తున్నారు.
విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని వందల ఏళ్ల కిందటి కథతో సాగుతుందని సమాచారం. ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లూను తీసుకున్నారు. ఓస్లూ అంటే ఎవరు అని అనుకుంటున్నారా? ‘మమ్మీ’ సినిమాలో విలన్‌గా నటించిన గండు ఆర్టిస్టే ఈ ఓస్లూ. ఆయనే ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ అని టాక్.
ఇక సినిమాలో విలన్ పాత్రకు హాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నారంటే సినిమాలో విదేశీ నేపథ్యం ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ స్థాయిలో నటుడిని తీసుకున్నారు అంటే భారీగానే ఇస్తారు. మరి అంత మొత్తంలో సినిమాకు ఉపయోగం ఉంటుందా?