వార్ 2(War 2) .. యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో రూపొందుతోన్న ఈ బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మొదట్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఎన్టీఆర్(Jr NTR) – హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్, స్పై యాక్షన్ బ్యాక్‌డ్రాప్, భారీ నిర్మాణ సంస్థ అన్నీ కలసి సినిమాకు పాన్ ఇండియా లెవెల్ హైప్‌ను తీసుకొచ్చాయి. కానీ తాజాగా రిలీజ్ అయిన టీజర్ మాత్రం ఈ ఊపును నిలుపుకోలేకపోయింది. హృతిక్ విజువల్స్ మెప్పించగా, ఎన్టీఆర్ పాత్ర ప్రెజెంటేషన్ విషయంలో నెగటివ్ కామెంట్లు చుట్టుముట్టాయి.
తెలుగు ప్రేక్షకుల్లో అంచనాల వెనకడుగు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) – రజనీకాంత్ (Rajinikanth) కాంబోలో రూపొందుతోన్న కూలీ (Coolie) మాత్రం అసలైన హైప్‌ను సంపాదించుకుంటోంది. రజిని మాస్ లుక్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లోకేష్ మేకింగ్, అలాగే నాగార్జున (Nagarjuna) పాత్ర నేపథ్యంలో తెలుగు మార్కెట్లో కూడా ఈ సినిమాకు మాస్ కనెక్ట్ బలంగా ఏర్పడుతోంది. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే… కూలీ, వార్ 2 కంటే ముందు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో వార్ 2 హైప్‌కి కొత్త ఉత్కంఠ తీసుకురావాలంటే, ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్‌లోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. టీజర్ తర్వాత ట్రైలర్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్‌లు, ఈవెంట్ హంగామా.. అన్నింటిలోనూ ఎన్టీఆర్ ముందుండాల్సిందే. ఎందుకంటే, హృతిక్ బలం ఉత్తరాదిలో ఉంది కానీ తెలుగు మార్కెట్లో మాత్రం సినిమాకు ఎన్టీఆర్ ఒక్కడే పిల్లర్. ఇది బాలీవుడ్ ఎంట్రీగా కూడా ఎన్టీఆర్‌కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో, ఈ బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది.
వార్ 2 టీమ్ ఇకపై ఎంత వేగంగా స్ట్రాటజీ మార్చుకుంటుందో, ఎన్టీఆర్ ప్రమోషన్ ఎలా ఉంటుందోపై తెలుగు మార్కెట్లో సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కూలీ మీదుగా వస్తున్న పాజిటివ్ వేవ్‌ని ఢీకొట్టాలంటే, ఎన్టీఆర్ హై వోల్టేజ్ ప్రమోషన్ తప్పదు. ఇప్పుడు టార్గెట్ ట్రైలర్‌తో షాక్ ఇవ్వడం, ఆపై ఎన్టీఆర్ అండతో ఆడియన్స్‌ను థియేటర్లవైపు తిప్పడం.. ఇది వార్ 2 సక్సెస్ కు మార్గం అవుతుందో లేదో చూడాలి.