Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఏవో చిన్నా చితకా సమస్యలు తప్ప.. నిరసనలు, ర్యాలీలు జరిగేంత పరిస్థితి అయితే రాలేదు. అయితే అనూహ్యంగా సోమవారం సాయంత్రం ఓ నిరసన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ దగ్గర కొవ్వొత్తు ర్యాలీని నిర్వహించారు. తెలుగు సినిమా ప్రముఖులు కొంతమంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఏమైందనే చర్చ మొదలైంది. ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’ అనే నినాదం ఎందుకు బయటకు వచ్చిందా అని చూస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

Tollywood

‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌.. బ్రింగ్‌ బ్యాక్‌ ది గ్లోరీ’ అనే నినాదంతో టాలీవుడ్‌ ప్రముఖులు డి.సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మురళీమోహన్, కె.అశోక్‌కుమార్, శివాజీరాజా, ఏడిద రాజా తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో మురళీమోహన్, డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహించింది. దాని కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. అందులోనే ఫిల్మ్‌ఛాంబర్‌ భవనం నిర్మించామని గుర్తు చేశారు..

అలా 40 ఏళ్ల కిందట నిర్మితమైన భవనంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్లేస్‌ను డెవలప్‌మెంట్‌ చేయాలని ఫిల్మ్‌నగర్‌ సొసైటీ నిర్ణయించుకుందని సమాచారం. ఈ బిల్డింగ్‌ను పడగొట్టి కొత్తగా మల్టీ స్టోర్‌ బిల్డింగ్‌ను నిర్మించి అందులో ఒక ఫ్లోర్‌ సినిమా ఇండస్ట్రీ కార్యాలయాల కోసం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారట. అయితే హైదరాబాద్‌కి ఐకానిక్‌ ప్లేస్‌లాంటి ఛాంబర్‌ను అలా షేర్‌ చేయడం సరికాదు అని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు ఛాంబర్‌ ఉన్న ప్రదేశంలో ప్రతి అంగుళం సినిమా పరిశ్రమకే ఉపయోగపడాలని పరిశ్రమ పెద్దలు కోరుతున్నారు.

మరి ఈ విషయంలో టాలీవుడ్‌ నుండి హీరోలు, హీరోయిన్లు ఏమన్నా ముందుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే వారికి ఇల్లు లాంటి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫీసు కూడా అందులోనే ఉంది. ఒకవేళ హీరోలు ముందుకొస్తే ఈ సమస్య త్వరగా తేలొచ్చు.

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus