టాలీవుడ్‌లో విజయవంతమైన జోడీ అనిపించుకుని.. ఆ తర్వాత ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమాతో హ్యాట్రిక్ మిస్ అయిన జోడీ నందమూరి బాలకృష్ణ – నయనతార. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన నయన్ – బాలయ్య ఇప్పుడు నాలుగోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అదేంటి నాలుగో సినిమా అన్నారు.. మూడో సినిమా సంగతి చెప్పలేదు అనుకుంటున్నారా? అంటే ఆ సినిమా ఫ్యాన్స్‌కి రుచించదు కాబట్టి.
‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా చేసిన బాలయ్య – నయన్ ఆ తర్వాతి ఏడాదిలోనే ‘శ్రీరామ రాజ్యం’ అంటూ వచ్చి డివైన్ బ్లాక్‌బస్టర్ సాధించారు. అక్కడికి ఏడేళ్ల తర్వాత తమ మూడో సినిమా ‘జై సింహా’ చేశారు. ఆ సినిమా అంతా బాగున్నా.. ఎక్కడో ఇబ్బందిగా అనిపించింది సరైన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఇద్దరూ హ్యాట్రిక్ సాధించలేకపోయారు. ఇప్పుడు నాలుగో సినిమా కోసం గోపీచంద్ మలినేని ప్రయత్నాలు చేస్తున్నారట. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కలసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే నెలలో ఈ సినిమా లాంఛనంగా మొదలుపెడతారట. డిసెంబరులో సినిమా చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి వెళతారట. ఈ లోపు కాస్టింగ్ పనులు ఫైనల్ చేసేయాలని గోపీచంద్ మలినేని చూస్తున్నారట. ‘పెద్ది’ సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ డీల్ ఓకే అయితే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా తర్వాత నయనతార ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతోంది. ‘అఖండ 2: తాండవం’ తర్వాత బాలయ్య ఈ సినిమా చేస్తారు.
‘వీర సింహా రెడ్ది’లో పవర్‌ఫుల్ విమెన్ రోల్స్ రాసిన గోపీచంద్ మలినేని ఇప్పుడు ఎలాంటి పాత్రలు సిద్ధం చేశారో చూడాలి. ఎందుకంటే నయనతార పాత్రల ఎంపిక విషయంలో ఈ విషయాన్ని కచ్చితంగా చూస్తుందంటారు. మిగిలిన భాషల సంగతేమో కానీ మన దగ్గర అయితే ఆమె ఈ పాయింట్ కచ్చితంగా పాటిస్తుంది.