పవన్ కల్యాణ్ యాక్టింగ్ కెరీర్‌లో ఎవరూ ఊహించని హైప్, అందరూ ఊహించిన విజయం, ఊహించినట్లుగా వసూళ్లు అందుకున్న చిత్రం అంటే ‘ఓజీ’ అనే చెప్పాలి. సినిమా లుక్, బ్యాగ్రౌండ్, కాన్సెప్ట్, హైప్ అన్నీ కలసి అదిరిపోయే విజయం అందుకున్నారు పవన్ కల్యాణ్. ఆ సినిమాలో పవన్‌ను సుజీత్ చూపించిన తీరు ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పుడు ఓటీటీలో సినిమాను తెగ ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాను పవన్ ఇప్పట్లో చేయడం, ఆ రికార్డులు బద్ధలుకొట్టడం అంత ఈజీ కాదు అనేది ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల మాట..
అయితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నిర్మాతల మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్లు తమ సినిమా మీద భారీ ఆశలు, అంచనాలే పెట్టుకున్నారు. అంతేకాదు వాటిని నిజం చేసేందుకు తమ దర్శకుడు అదిరిపోయే సినిమాతో వస్తున్నాడు అని పక్కాగా చెబుతున్నారు. మొన్నీ మధ్య ఓ సినిమా ప్రచారంలో భాగంగా మైత్రీ మూవీస్ రవిశంకర్ యలమంచిలి మీడియాతో మాట్లాడుతూ తమ రాబోయే సినిమాల గురించి చెప్పుకొచ్చారు. అప్పుడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రస్తావనకు వచ్చింది.
తాము రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. ‘ఓజి’ సినిమాను మించి ఉంటుందని రవిశంకర్ చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు. అయితే, పైన చెప్పినట్లు పవన్ కెరీర్‌లో అనౌన్స్‌మెంట్ నుండి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ అందుకున్న సినిమాను బీట్ చేయడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి సాధ్యమా అనేదే ప్రశ్న. అందులోనూ ఈ సినిమా రీమేక్. తమిళంలో విజయ్ చేసిన ‘తెరి’ని ఇక్కడ నేపథ్యం మార్చి తెస్తున్నారు. అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉండదు అని సినిమా అంటోంది.
ఆ విషయం పక్కనపెడితే ‘ఓజీ’ సినిమాను కొట్టే కంటెట్ తీసుకురావడం దర్శకుడు హరీశ్ శంకర్‌కి సాధ్యమా అంటే.. గతంలో ‘గబ్బర్ సింగ్’తో చేసి చూపించారు. కానీ ఇప్పుడు ఆయన అంత స్వింగ్‌లో లేరు. మరి మైత్రీ వాళ్ల నమ్మకమేంటో చూడాలి.