Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

సెన్సార్‌ బోర్డు విషయంలో గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాల విషయంలో ఒంటెద్దు పోకడలకు పోతున్నారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాలను గుచ్చి గుచ్చి చూస్తున్నారు అంటూ వివిధ ఉదాహరణలతో మన దర్శకనిర్మాతలు చెబుతూనే ఉన్నారు. మరి ఆ విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయో.. లేక చాలా కాలం అయిపోయింది (ఇప్పుడున్న ప్యానల్‌ 9 ఏళ్ల క్రితం ప్రకటించింది) ఈ ప్యానల్‌ వచ్చి అనుకున్నారో కానీ.. కొత్త ప్యానల్‌ను అనౌన్స్‌ చేశారు.

Supriya Yarlagadda

గతంలో 12 మంది ఉన్న ప్యానల్‌ను ఈ సారి 18కి పెంచారు. కొత్త ప్యానల్‌లో ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ యార్లగడ్డకు స్థానం కల్పించారు. సుప్రియ పవన్ కల్యాణ్‌తో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు.

కొత్త బోర్డులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, నటుడు మనోజ్ జోషి, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ, నటి పల్లవి జోషి, టీవీ నటి రూపాలీ గంగూలీ, వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతంగే ఉన్నారు. వీరితో పాటు బాలీవుడ్‌ నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి కూడా ఉన్నారు. ఈ కొత్త బోర్డు మూడేళ్ల పాటు కొనసాగుతుంది. లేదంటే మరో కొత్త ప్యానల్‌ ఎంపికయ్యేంతవరకు కూడా ఉంటుంది.

ఇదంతా ఓకే. కానీ కొత్త సెన్సార్‌ బోర్డు ప్యానల్‌ వల్ల సినిమాలకు కష్టాలు తీరుతాయా అనేదే ప్రశ్న. ఎందుకంటే గత కొన్నేళ్లుగా రూల్స్‌ పేరుతో చాలా సినిమాలను పాత ప్యానల్‌ ఇబ్బంది పెట్టింది అనే విమర్శలు ఉన్నాయి. సినిమా టైటిల్స్‌ విషయంలో, సన్నివేశాల విషయంలో, డైలాగ్‌ల విషయంలో చాలా ఇబ్బందే పడ్డాయి. కొన్ని సినిమాలు అయితే నెలల తరబడి ఆగిపోయాయి. కాబట్టి కొత్త ప్యానల్‌ అలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి.

శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus