Kingston: ఇలాంటి సినిమా ఇంతవరకు ఇండియన్‌ సినిమాలో రాలేదట! ఏంటా స్పెషల్‌?

రెండు పడవల ప్రయాణం అనే మాట సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే రెండు విభాగాలపై పట్టు ఉన్న వాళ్లు అది కాస్త, ఇది కాస్త చేస్తూ ఉంటారు. ఆ రెండు పనుల్ని బాగా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. రెండు విభాగాలకు అలా న్యాయం చేస్తున్న వాళ్లలో తమిళ నటుడు, సౌత్‌ సినిమాల సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ (G. V. Prakash Kumar) ఒకరు. ఓ వైపు సంగీత దర్శకుడిగా వరుస సినిమాలతో జోరు చూపిస్తూనే.. మరోవైపు హీరోగానూ అలరిస్తున్నాడు.

Kingston

సంగీత దర్శకుడిగా వందకుపైగా సినిమాలకు మ్యూజిక్‌ అందించిన జీవీప్రకాశ్‌ కుమార్‌ హీరోగా ఓ మైలురాయిని చేరుకున్నాడు. ఆయన కొత్త సినిమా ‘కింగ్స్టన్‌’ (Kingston). ఈ సినిమా హీరోగా ఆయనకు 25వది. కమల్‌ ప్రకాశ్‌ (Kamal Prakash) దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌ సినిమాకు జీవీ ప్రకాశ్‌ నిర్మాత కూడా. అంటే సినిమా మీద ఆయనకు అంత నమ్మకం ఉందన్నమాట. ఈ నెల 7న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ప్రచారం కోసం ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన జీవీ ప్రకాశ్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘కింగ్స్టన్‌’ సినిమా ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పాడు. అమ్మమ్మలు.. బామ్మలు గతంలో చెప్పిన కథల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నాడు. మన దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని చెప్పాడు. సముద్ర తీరంలో ఉన్న ఓ ఊరిలో ఈ సినిమా సాగుతుందన్నాడు.

జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తుంటారు. కానీ ఆ ఊరిలో ఎవరూ వెళ్లరు. ఓ శాపమే దానికి కారణం. దాన్ని ఎదిరించి సముద్రంలోకి వెళ్లిన హీరోకి ఎదురైన అనుభవాలేంటి అనేదే సినిమా కథ అని చెప్పారాయన. సినిమాలో జాంబీలు, ఆత్మలు, నిధులు లాంటి ఇంట్రెస్టింగ్‌ పాయింట్లు చాలానే ఉన్నాయని చెప్పారాయన. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జారిపడి కాళ్లకు, వేళ్లకు గాయాలయ్యేవని, రక్తం కారుతున్నా బ్యాండేజ్‌ వేసుకుని మళ్లీ షూటింగ్‌ చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారాయన.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus