‘ఓజీ’ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు ఉంది అనగా.. దర్శకుడు సుజీత్ ఓ ట్వీట్ చేశారు. అందులో తన మనసులోని ‘సుజీత్ సినిమాటిక్ యూనివర్స్’ గురించి చెప్పీ చెప్పకుండా చెప్పారు. అయితే అప్పటికే ఆయన ఆలోచన లీకైపోయింది. అనుకున్నట్లుగా సినిమాలో ‘సాహో’ ప్రస్తావన తీసుకొచ్చారు. అదేనండీ వాజీ సిటీ గురించి, అక్కడి పరిస్థితుల గురించి. సినిమా ఆఖరులో ‘ఓజీ 2’ అనే టైటిల్ కార్డు వేసి, పాయింట్‌ను టీజ్ చేసి వదిలేశారు. అయితే నిజంగానే ‘ఓజీ’ యూనివర్శ్ ఉంటుందా అనే డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే పక్కా అని అర్థమవుతోంది.
మెగా ఫ్యామిలీ కోసం ‘ఓజీ’ సినిమాను ఇటీవల ప్రత్యేకంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా టీమ్‌ను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ‘ఓజీ’ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేశారు. దీంతో ఆయన ‘ఓజీ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు బంతి డైరెక్టర్ సుజీత్ కోర్టులో పడింది. ఎందుకంటే సుజీత్ నెక్స్ట్ ఈ సినిమా మీద కూర్చునే అవకాశం లేదు.
నానితో ఓ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ సినిమా అయ్యాకనే తిరిగి ‘ఓజీ 2’ సినిమాల పనులు స్టార్ట్ చేశారు. ఆ లెక్కన ‘ఓజీ 2’ ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో సుజీత్ చెప్పినట్లుగా రెండో ‘ఓజీ’లో గంభీర జపాన్‌లో ఏం చేశాడు అనేది చూపించే అవకాశం ఉంది. దీని కోసం పవన్ అన్ని డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికప్పుడు ఈ సినిమా కష్టం. అయితే ప్రభాస్, పవన్‌ను కలిసి ఓ మల్టీస్టారర్ చేసి.. గంభీర, సాహోను కలిపి చూపించొచ్చు అనే మరో చర్చ నడుస్తోంది. చూడాలి మరి సుజీత్ మనసులో ఏముందో?