‘ఇక మా వల్ల కాదు.. మేం షూటింగ్‌లు ఆపేస్తాం’.. యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చెప్పిన మాట ఇది. ఈ మేరకు ఆగస్టు 1 నుండి చిత్రీకరణలు నిలిపేస్తాం అంటూ.. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎందుకు అంటే.. నిర్మాతలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిచండానికి, మా బాధ అందరికీ తెలియడానికి అంటున్నారు. ఇక్కడే ఓ విషయం మాట్లాడుకోవాలి. షూటింగ్‌లు ఆపేస్తేనే మాట్లాడటం కుదురుతుందా? షూటింగ్‌లు జరుపుతూ నిర్మాతలు తమ సమస్యలపై చర్చించుకోలేరా? ఇది మొదటి ప్రశ్న అయితే…
ఏ రోజు కష్టం ఆ రోజు డబ్బులు అనేలా బతుకుతున్న కార్మికులు ఏమైపోవాలి? ఇది రెండో ప్రశ్న. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అంటే.. ప్రస్తుతం ఓ ఐదింటి గురించి మాట్లాడుతున్నారు. టికెట్ ధరలు, ఓటీటీ, నిర్మాణ వ్యయం, పర్సంటేజీ విధానం, వీపీఎఫ్ ఛార్జీలు. ఈ విషయాలపై కచ్చితంగా పరిశ్రమ మొత్తం చర్చించాలి. ఎందుకంటే నిర్మాత ఉంటేనే సినిమా ఉంటుంది. అలా అని కార్మికులు లేకపోతే సినిమా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి.
కరోనా సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సమస్య అయిపోయింది అన్నాక.. ఈ బంద్ ఏంటి అని కొంతమంది కార్మికులు మౌనంగా రోదిస్తున్నారు. ప్రపంచంలో అన్ని రకాల సేవల రేట్లు పెరుగుతున్నాయి అంటూ ఆ మధ్య సినిమా టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. మరోవైపు నాణ్యమైన సినిమాలు తీయలేకపోతున్నారు. ఈ రెండు విషయాలతో సగటు ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదు.
దీంతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలవైపు పడ్డారు. ఇప్పుడు అవే ఓటీటీలు థియేటర్లకు శాపంలా మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో జనాలు ఓటీటీలవైపు వెళ్లడానికి కారణమైంది నిర్మాతలే అని చెప్పాలి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్ని ఓటీటీకి ఇచ్చి దారి చూసుకున్నారు. అలాగే ప్రేక్షకులకు దారి చూపించారు. ఇప్పుడు మీరు ఓటీటీల్లో చూడొద్దు, థియేటర్లకే రండి అని నిర్మాతలు అడగడం ఎంతవరకు కరెక్ట్. ప్రేక్షకుడు తనకు నచ్చిన దగ్గర చూస్తాడు. థియేటర్‌కి వచ్చేలా చేసుకోవాల్సింది చిత్రబృందమే.
దానికి థియేటర్లకు జనాలు రావడం లేదు, మాకు లాభాలు రావడం లేదు, ఖర్చులకు తగ్గ లాభం ఉండటం లేదు అని ప్రేక్షకుల మీద నెట్టేస్తే ఎలా. అలాగే ఆ కోపంతో సినిమాలు ఆపేసి కార్మికుల పొట్టకొడితే ఎట్టా. పోనీ సినిమాలు ఆపేస్తే హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. అప్పటికే వాళ్లకు రావాల్సింది వచ్చేసే ఉంటుంది. ఇక నష్టపోయేది కార్మికులు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, థియేటర్లు, వాటి మీద ఆధారపడినవారే. కాబట్టి సినిమా చిత్రీకరణ ఆపకుండా మాట్లాడిల్సింది మాట్లాడుకుంటే సరి అనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.